మ్యూజిక్ కంపెనీ సీఈవో కిడ్నాప్ కేసు..నిందితుల్లో ఎమ్మెల్యే కుమారుడు

తలకు తుపాకి గురిపెట్టి మరీ కిడ్నాప్

Son of Shinde faction MLA ‘kidnaps’ music company CEO at gunpoint; FIR filed

ముంబయిః వ్యాపారవేత్త రాజ్‌కుమార్ సింగ్‌ను కిడ్నాప్ చేసిన కేసులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌షిండే వర్గం ఎమ్మెల్యే ప్రకాశ్ సర్వే కుమారుడు రాజ్ సర్వేతోపాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాజ్‌కుమార్‌కు తుపాకి గురిపెట్టి గోరేగావ్ ప్రాంతం నుంచి ఆయనను అపహరించి తీసుకెళ్లారు. అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో ఈ కిడ్నాప్ వ్యవహారం మొత్తం రికార్డైంది.

10 నుంచి 15 మంది ముంబయి గోరేగావ్‌లోని గ్లోబల్ మ్యూజిక్ జంక్షన్ ఆఫీస్‌లోకి దూసుకెళ్లి ఆ కంపెనీ సీఈవోను బలవంతంగా అపహరించారు. అంతుకుముందు వారు ఆఫీస్ సిబ్బందితో గొడవడడం కూడా వీడియోలో కనిపించింది. ఈ ఘటనపై రాజ్‌కుమార్ సింగ్ మాట్లాడుతూ.. పాట్నాకు చెందిన మనోజ్ మిశ్రా అనే వ్యక్తికి ఇవ్వాల్సిన బిజినెస్ లోన్ వ్యవహారంలోనే ఈ కిడ్నాప్ జరిగిందని, తలకు తుపాకి గురిపెట్టి లోన్‌ను సెటిల్ చేసుకోవాలని బెదిరించారని ఆరోపించారు.

రాజ్‌కుమార్‌ను అపహరించిన దుండగులు ఆయనను దహిసార్‌లోని ఎమ్మెల్యే ప్రకాశ్ సర్వే కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ ఆయన కుమారుడు సహా ఆయన అనుచరులు రాజ్‌కుమార్‌ను బెదిరించారు. మ్యాటర్‌ను సెటిల్ చేసుకోవాలని తుపాకితో బెదిరించారు. అంతేకాకుండా ఈ విషయాన్ని బయట ఎక్కడా చెప్పొద్దని బెదిరించినట్టు ఎఫ్ఆర్‌ను ఉటంకిస్తూ ‘ఏఎన్ఐ’ తన కథనంలో పేర్కొంది.