హిందువులు ఓటర్లు కారా? ..సోము వీర్రాజు

టిడిపి, వైఎస్‌ఆర్‌సిపిలవి ఓటు బ్యాంకు రాజకీయాలని విమర్శ

Somu veerraju

అమరావతి: నంద్యాలలో అబ్దుల్ సలాం తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో సీఐ, హెడ్ కానిస్టేబుల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఏపి బిజెపి చీఫ్ సోము వీర్రాజు ఈ చర్యను తప్పుబట్టారు. అబ్దుల్ సలాం పాత నేరస్తుడు కాబట్టే ఓ చోరీ కేసులో అతడిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారించారని, ఆ తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. ఆత్మహత్య చేసుకునేందుకు ఎవరి కారణాలు వారికుంటాయని, కానీ డ్యూటీ చేసిన పోలీసులను అరెస్ట్ చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అంతమాత్రాన పిఎంను బాధ్యుడ్ని చేసి అరెస్ట్ చేస్తున్నారా? అని ప్రశ్నించారు.

ఈ వ్యవహారంలో చంద్రబాబు ముస్లింలందరినీ సమీకరించి పెద్ద ఉద్యమం నడుపుతున్నాడని సోము వీర్రాజు ఆరోపించారు. అటు టిడిపి, ఇటు వైఎస్‌ఆర్‌సిపి ముస్లిం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ కేసులో అరెస్ట్ అయిన వారికి టిడిపియే బెయిల్ ఇప్పించి, మరోవైపు ముస్లింలను రెచ్చగొడుతుందని, మరోవైపు, ప్రభుత్వం తరఫున డీజీపీ మాట్లాడుతూ.. ఈ కేసులో ఎవరినీ వదలబోమని అంటాడని, అసలు వీళ్లకు ముస్లింలే ముఖ్యమా, హిందువులు ఓటర్లు కారా? అని వీర్రాజు నిలదీశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/