పాకిస్థాన్ లో మరో హిందూ దేవాలయం ధ్వంసం

సిద్ధి వినాయక దేవాలయం విధ్వంసం


ఇస్లామాబాద్ : పాకిస్థాన్ లో అరాచక శక్తులు విజృంభిస్తున్నాయి. మరో హిందూ దేవాలయంపై దాడి చేసిన దుండగులు, ఆలయాన్ని ధ్వంసం చేయడమే కాకుండా, నిప్పు పెట్టారు. రహీంయార్ ఖాన్ జిల్లాలోని భోంగ్ నగరంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలను పాకిస్థాన్ హిందూ నేత, పార్లమెంటు సభ్యుడు రమేశ్ కుమార్ వంక్వానీ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

కర్రలు, రాడ్లు చేతబూని వినాయక ఆలయంలోకి చొరబడిన ఓ మూక, విగ్రహాలను నాశనం చేస్తూ విధ్వంసానికి పాల్పడుతున్న దృశ్యాలను ఆ వీడియోల్లో చూడొచ్చు. అనంతరం, సమీపంలోని రోడ్డును దిగ్బంధించి వీరంగం వేశారు. దీనిపై రమేశ్ కుమార్ స్పందిస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు ఎంతో నిదానంగా వచ్చారని, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని వెల్లడించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/