జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టాలని లక్ష్మణ్ డిమాండ్

జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టాలని లక్ష్మణ్ డిమాండ్ చేసారు. హైదరాబాద్‌ నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో లక్ష్మణ్ పాల్గొన్నారు. పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ జాతి గర్వపడే విధంగా బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన సర్వాయి పాపన్న జయంతి జరుపుకుంటున్నామని అన్నారు. తాడిచెట్టుపై పన్ను విధించిన నియంత పాలనపై పాపన్న వీరోచితంగా పోరాడారని తెలిపారు. నేటి యువతకు ఆయన స్ఫూర్తి అని చెప్పారు. జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. టాంక్‌బండ్‌పై ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని అన్నారు.

గోల్కొండ కోటగా సామ్రాజ్యాన్ని స్థాపించి బడుగుల రాజ్యాధికారం కోసం కృషి చేసిన మహనీయుడు సర్వాయి పాపన్న. తెలంగాణ గడ్డపై స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే మహనీయుల త్యాగాల ఫలితమే. కానీ ఇప్పటి తెలంగాణలో నియంత పాలన సాగుతోంది. కేసీఆర్ సర్కార్‌పై యువత తిరగబడాల్సిన అవసరం ఉంది. బిజెపి అండగా యువత పోరాటం చేసేందుకు ముందుకు రావాలి. కేసీఆర్ కుటుంబ పాలనకు యువత చరమగీతం పాడాలి. నిజాం తరహా పాలనను కేసీఆర్ కొనసాగిస్తున్నారు. కేసీఆర్ పాలనను భూస్థాపితం చేయడమే.. సర్వాయి పాపన్నకు ఘనమైన నివాళి అవుతుందని లక్ష్మణ్ అన్నారు.