తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్..ఈ నెల 28 న రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నగదు

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ తెలిపింది సర్కార్. గత కొద్దీ రోజులుగా రైతు బంధు నిధుల కోసం యావత్ రైతులు ఎదురుచూస్తున్నారు. మరోపక్క విపక్షాలు సైతం నిధులు ఇంకా వేయడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ రైతుల నిధులు జమ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసారు. ఈ నెల 28 నుంచి వానాకాలం పంట పెట్టుబ‌డి రైతు బంధు నిధుల‌ను విడుద‌ల చేయాల‌ని సీఎం కేసీఆర్ అధికార యంత్రాంగానికి బుధ‌వారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో అదే రోజు నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధుల‌ను జ‌మ చేస్తామ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌దర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ఎప్పటిలాగే రైతుల భూ విస్తీర్ణం ప్రకారం (ఎకరాల వారీగా) వరుస క్రమంలో వారి ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేయనున్నారు. అంతకుముందు వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి.. మీడియాతో మాట్లాడుతూ ఇదే విషయాన్ని చెప్పారు. రైతులందరి ఖాతాల్లో త్వరలోనే రైతుబంధు పెట్టుబడి సాయం జమ చేస్తామని చెప్పారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఆర్థిక, వ్యవసాయ శాఖలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని ఆయన చెప్పారు.

వ్యవసాయం కోసం పెట్టుబడిని ఋణంగా నగదు రూపంలో రైతులకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే రైతుబంధు పథకం ఈ పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు 2018, మే 10న కరీంనగర్‌ జిల్లా, హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని శాలపల్లి – ఇందిరానగర్‌ వద్ద ప్రారంభించాడు. మొట్టమొదటి సారిగా ధర్మరాజుపల్లి వాసులు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా చెక్కులు, పట్టాదార్‌ పాసు పుస్తకాలు అందుకున్నారు. రైతుబంధు పథకం కింద ప్రభుత్వం ఎకరానికి రూ.5 వేల చొప్పున సాగుకు పెట్టుబడి సాయం చేయనుంది. ఖరీఫ్, రబీ సీజన్ లకు ఎకరానికి రూ. 5000 చొప్పున రెండు సీజన్లకు కలిపి రూ. 10000 పెట్టుబడిగా ఇవ్వనుంది. ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో వేయనుంది.