కర్ణాటక రైతులను పెళ్లి చేసుకోబోయే వధువుకు రూ.5 లక్షలు..రైతు సంఘాల విజ్ఞప్తి

45 ఏళ్లు వచ్చినా యువ రైతులకు పెళ్లి కావడంలేదని వెల్లడి

Rs. 5 lakhs for the bride who is going to marry the farmers of Karnataka

బెంగళూరుః సేద్యాన్ని నమ్ముకున్న రైతులను పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు ఇష్టపడడంలేదని కర్ణాటక రైతులు వాపోతున్నారు. దీంతో 45 ఏళ్లు వచ్చినా యువ రైతులు అవివాహితులుగానే మిగిలిపోతున్నారని చెప్పారు. అన్నదాతలకు కుటుంబ జీవితం దక్కడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు రైతు సంఘాల ప్రతినిధులు వినతిపత్రం అందిస్తూ.. యువ రైతును పెళ్లి చేసుకునే అమ్మాయికి రూ.5 లక్షల నగదు ప్రోత్సాహం ఇవ్వాలని అందులో డిమాండ్ చేశారు. సోమవారం రైతు సంఘాలతో జరిగిన భేటీలో సీఎం సిద్ధరామయ్యకు తమ డిమాండ్ వినిపించారు.

కర్ణాటక అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలకు ముందు సీఎం సిద్ధరామయ్య రైతు సంఘాల నేతలతో సమావేశం అయ్యారు. వ్యవసాయ రంగానికి కేటాయింపులపై సీఎం వారితో చర్చించారు. వివిధ పథకాల అమలు, ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలపై రైతు సంఘాల నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. రైతు సంఘంలో పౌష్టికాహారం పెంపుదల, నీటి వనరుల అభివృద్ధి, వ్యవసాయ అధికారుల నైపుణ్యాల పెంపుదలకు అవసరమైన నిధులను బడ్జెట్ లో కేటాయించాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే సేద్యాన్ని నమ్ముకుని, ఏటా లక్షలు ఆర్జిస్తున్నా కూడా యువ రైతులకు పెళ్లి కావడంలేదని సీఎం సిద్ధరామయ్యకు తెలిపారు. ఈ పరిస్థితిని తప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, రైతును పెళ్లి చేసుకునే అమ్మాయికి ప్రభుత్వం తరఫున నగదు ప్రోత్సాహం ప్రకటించాలని కోరారు.