పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం ..7 మృతి

రోడ్డు ప్రమాదాలు అస్సలు తగ్గడం లేదు. ఇంటి నుండి బయటకు వెళ్లిన వారు వచ్చే వరకు ఇంట్లో ఉన్న వారికే టెన్షనే. అతివేగం , నిర్లక్ష్యపు డ్రైవింగ్ , మద్యం మత్తులో వాహనాలు నడపడం వీటితో తరుచు వాహనాలు ప్రమాదాలకు గురి అవుతూ..అమాయకపు ప్రజల మృతువువాత పడుతున్నారు. తాజాగా పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకోగా, ఏడుగురు మృతి చెందారు. ఆదివారం అర్ధరాత్రి రెంటచింతల రహదారిఫై ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే..

పల్నాడు జిల్లా రెంటచింతల బీసీ కాలనీకి చెందిన వారంతా సరకు రవాణా చేసే టాటా ఏస్‌ వాహనంలో శ్రీశైలం నుంచి తిరిగివస్తుండగా.. రెంటచింతల పొలిమేరలోకిరాగానే స్థానిక విద్యుత్తు ఉపకేంద్రం వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొంది. వాహనం పల్టీలు కొట్టడంతో ప్రయాణిస్తున్న వారంతా ఒకరిపై ఒకరు పడటంతో ఆర్తనాదాలు చేశారు. ప్రమాద సమయంలో వాహనంలో 38 మంది ఉన్నారు. సంఘటనా స్థలంలో నలుగురు చనిపోగా, హాస్పటల్ కు తరలిస్తుండగా ఒకరు మృతి చెందారు. తీవ్ర గాయాలైన మరో ఇద్దరు గురజాల హాస్పటల్ లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.

మృతిచెందినవారు నేతి నేనీ కోటేశ్వరమ్మ(45), రోశమ్మ(65), రమాదేవి(50), కోటమ్మ(70), రమణమ్మ(50), లక్ష్మీనారాయణ(35), కానాలపద్మగా పోలీసులు గుర్తించారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ గుంటూరు సర్వజనాసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెపుతున్నారు.