లిజ్ ట్రస్ రాజీనామా..ప్రధాని రేసులో ముందున్న రిషి సునాక్

rishi-sunak-once-again-in-the-race

లండన్: మినీ బడ్జెట్ లో పన్నుల కోతల ప్రతిపాదనలు బెడిసికొట్టడం లిజ్ ట్రస్ కొంపముంచింది. అస్తవ్యస్త ఆర్థిక విధానాలతో ఇప్పటికే ఆర్థికమంత్రి పదవి నుంచి క్వాసీ కార్టెంగ్ ను తొలగించిన లిజ్ ట్రస్… అన్ని వైపుల నుంచి వస్తున్న ఒత్తిళ్లను ఎదుర్కోలేకపోయారు. దీంతో బ్రిటన్ ప్రధాన మంత్రి పదవికి లిజ్ ట్రస్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

అయితే తదుపరి ప్రధాని ఎవరన్న దానికి కన్జర్వేటివ్ పార్టీ నేత, ఇటీవల ఎన్నికల్లో లిజ్ ట్రస్ కు పోటీదారుగా నిలిచిన్ రిషి సునాక్ పేరు గట్టిగా వినిపిస్తోంది. మాజీ ఆర్థికమంత్రి అయిన రిషి సునాక్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న బ్రిటన్ ను నడిపించగలడన్న వాదనలు బలపడుతున్నాయి. మరోసారి బ్రిటన్ నాయకత్వం కోసం ఎన్నికలు జరిగితే రిషి సునాక్, జెరెమీ హంట్, పెన్నీ మోర్డాంట్ ల మధ్య ప్రధాన పోరు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సునాక్, మోర్డాంట్ గత ఎన్నికల్లోనూ ప్రధాని రేసులో పోటీపడ్డారు. అయితే తుదిరేసులో లిజ్ ట్రస్, సునాక్ మిగిలారు. ఇప్పుడు సునాక్ ముందు బ్రిటీష్ ప్రధాని అయ్యే సువర్ణావకాశం నిలిచింది. బ్రిటన్ లోని బెట్టింగ్ కంపెనీలు కూడా సునాక్ ఫేవరెట్ అని పేర్కొంటున్నాయి. ప్రధాని రేసులో జెరెమీ హంట్ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఆయన మంత్రి పదవి చేపట్టిన కొన్నిరోజులే అయింది. అయినప్పటికీ ఫేవరెట్ల జాబితాలో హంట్ పేరు కూడా చేరింది. కాగా, తదుపరి ప్రధానిని ఎన్నుకునే వరకు ప్రధాని పదవిలో కొనసాగుతానని లిజ్ ట్రస్ వెల్లడించారు.

బ్రిటన్ ప్రధాని పదివి చేపట్టిన 45 రోజులకే ఆమె పదవికి రాజీనామా చేయడం గమనార్హం. ప్రధాని పదవికి ట్రస్ రాజీనామాతో బ్రిటన్ లో మరోమారు రాజకీయ సంక్షోభం నెలకొంది. ఇటీవలే బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన ట్రస్… మినీ బడ్జెట్ ప్రవేశపెట్టి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అప్పటికే దేశంలో అంతకంతకూ పెరుగుతున్న ఆర్థిక సంక్షోభాన్ని అదుపు చేయలేక మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో ప్రధాని పదవి రేసులో భారత సంతతికి చెందిన రిషి సునక్ తో పోటీ పడి మరీ లిజ్ ట్రస్ విజయం సాధించారు.