కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బహిరంగ క్షమాపణలు తెలిపిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి..ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బహిరంగ క్షమాపణలు తెలిపారు. చండూరు బహిరంగ సభలో అద్దంకి దయాకర్ వ్యాఖ్యలు సరికాదని పేర్కొన్న రేవంత్.. హోంగార్డు ప్రస్తావన అలాగే చండూరు బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు తెలిపారు.

రేవంత్ రెడ్డి తనను హోంగార్డ్‌తో పోల్చి అవమానించాడని.. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని వెంటనే క్షమాపణలు కోరాలని వెంకటరెడ్డి చేసిన డిమాండ్ పట్ల రేవంత్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘ఈ మధ్య పత్రికా సమావేశంలో హోంగార్డ్ ప్రస్తావన.. మునుగోడు బహిరంగ సభలో అద్దంకి దయాకర్.. కోమటిరెడ్డిని ఉద్దేశించి పరుష పదజాలం వాడటంతో.. పీసీసీ చీఫ్‌ సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. నేను భేషరతుగా క్షమాపణలు చెబుతున్నాను. ఇలాంటి భాష ఎవరికీ మంచిది కాదు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి.. రాష్ట్ర సాధనలో పాత్ర పోషించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఎవరూ అవమానించేలా మాట్లాడటం తగదు. తదుపరి చర్యల కోసం క్రమశిక్షణా సంఘం చైర్మన్ చిన్నారెడ్డి గారికి సూచన చేస్తున్నా’ అని రేవంత్ రెడ్డి వీడియో సందేశాన్ని పోస్టు చేశారు.

ఇదిలా ఉంటె కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 21 న రాజగోపాల్ బిజెపి లో చేరబోతున్నారు. మరో రెండు , మూడు నెలల్లో మునుగోడు ఉప ఎన్నిక జరగబోతుంది. ఈ ఎన్నికను అన్ని పార్టీ లు ఎంతో ప్రెతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపు మాదంటే మాది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఫైనల్ గా గెలుపు ఏ పార్టీని వరిస్తుందో చూడాలి.