కొడాలి నాని ఫై పోటీ చేస్తా అంటున్న రేణుక చౌదరి

వైస్సార్సీపీ మాజీ మంత్రి , గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఫై కేంద్ర మాజీమంత్రి రేణుక చౌదరి విమర్శల వర్షం కురిపించింది. రాబోయే ఎన్నికల్లో కొడాలి నాని ఫై పోటీ చేసి గెలిచి తీరుతా అన్నది. అమరావతే ఏపీ రాజధానిగా ఉండాలంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమానికి, పాదయాత్రకు మాజీ ఎంపీ రేణుకా చౌదరి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతే కాదు అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రలో కూడా ఆమె పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆమెపై వైస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శలు గుప్పించారు. ఖమ్మంలో కార్పొరేటర్ గా కూడా గెలవలేని రేణుకా చౌదరికి అమరావతిలో ఏం పని? అని ఆయన ప్రశ్నించారు. కొడాలి కామెంట్ పై రేణుక చౌదరి ఓ ఇంటర్వ్యూలో ఘాటుగా స్పందించారు.

కొడాలి నాని రాజకీయాల్లోకి రాకముందే తాను కార్పొరేటర్ అని అన్నారు. ‘బుజ్జి నీకు చరిత్ర తెలియదు, రాజీవ్ గాంధీ ఇచ్చిన మొబైల్ లో గూగుల్ కొట్టు, రేణుకా చౌదరి అంటే ఏమిటో నీకు తెలుస్తుంది. నువ్వు మాజీ మంత్రి కదా, నువ్వు ఏదో పదవి కోసం అసెంబ్లీలో నా పేరు తీసుకొచ్చావు. చాలా థాంక్స్’ అన్నారు. తాను వచ్చే ఎన్నికల్లో ఆయన నియోజకవర్గంలో గుడివాడ నుంచి పోటీ చేస్తానని, తాను మున్సిపల్ కార్పొరేటర్ గా చేశా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేశానన్నారు. తన సత్తా ఏంటో కొడాలి నానికి తెలియదని ఎద్దేవా చేశారు. కొడాలి నాని ఎంత అమాయకుడు కాకపోతే… ఏపీ అసెంబ్లీలో నా పేరు తీసుకొచ్చి… నాకు బొచ్చెడు పబ్లిసిటీ తీసుకొచ్చాడు. ఇంత పబ్లిసిటీ తెచ్చుకోవాలంటే చాలా ఖర్చు పెట్టాలి. నాని వల్ల నాకు పబ్లిసిటీ ఫ్రీగా వచ్చిందన్నారు.