రెండో రోజు భారీగా పెరిగిన సార్ కలెక్షన్స్

ధనుష్ – సంయుక్త జంటగా వెంకీ అట్లూరి డైరెక్షన్లో తెరకెక్కిన సార్ మూవీ..మహాశివరాత్రి సందర్బంగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. కొత్త కథేమీ కానప్పటికీ , చెప్పిన విధానం మాత్రం కొత్తగా అనిపించడం, స్క్రీన్ ప్లేలో చాలా వరకు వెంకీ అట్లూరి తన మ్యాజిక్ చూపించడం తో ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా చదువును మార్కెట్లో వ్యాపారంగా ఎలా మార్చారు అనే విషయాన్ని అద్భుతంగా స్క్రీన్ మీద చూపించాడు డైరెక్టర్ వెంకీ అట్లూరి. ఈ విషయంలో నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యాడు. గవర్నమెంట్ కాలేజీలను ప్రభుత్వం కూడా ఎందుకు పట్టించుకోవడం లేదు.. ప్రైవేట్ సెక్టార్లో పడి చదువు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎలా దూరమైపోతుంది అనేది ఈ సినిమాలో చక్కగా చూపించారు. ఎక్కడ కమర్షియల్ హక్కులకు పోకుండా హానెస్ట్ అటెంప్ట్ చేసి సక్సెస్ అయ్యాడని అంటున్నారు. టాక్ బాగుండడం తో సినిమాను చూసేందుకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు.

మొదటి రోజు కంటే రెండో రోజు కలెక్షన్లు భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో నైజాంలో రూ. 2.34 కోట్లు, సీడెడ్ లో రూ. 77 లక్షలు, ఉత్తరాంధ్ర రూ. 74 లక్షలు, ఈస్ట్ గోదావరి రూ. 57 లక్షలు, వెస్ట్ గోదావరి రూ. 22 లక్షలు, గుంటూరు 49 లక్షలు, కృష్ణా రూ. 42 లక్షలు, నెల్లూరు రూ. 25 లక్షల కలెక్షన్స్ నమోదు చేసింది. అంటే మొత్తంగా రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.80 కోట్ల షేర్, రూ. 10.54 కోట్ల గ్రాస్ అందుకుంది. అలాగే యూకేలో రూ. 52 లక్షలు, కర్ణాటకలో రూ. 1.62 కోట్లు, తమిళనాడులో రూ. 6 కోట్లు రాబట్టి ఇలా ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో రూ. 20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో ఇంకో రూ.20 లక్షలు వస్తే బ్రేక్ ఈవెన్ అయినట్లే.