గుంటూరులో ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారయత్నం

ఏపీలో రోజు రోజుకు ఆడవారిపై లైంగిక దాడులు ఎక్కువైపోతున్నాయి. ఓ పక్క రాష్ట్ర సర్కార్ , పోలీసులు , కోర్ట్ లు పలు కఠిన శిక్షలు తీసుకొస్తున్నప్పటికీ కామాంధులు మాత్రం వారి ఆగడాలను ఆపడం లేదు. ప్రతి రోజు ఎక్కడో ఓ చోట మహిళల ఫై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న ప్రకాశం జిల్లాలో మహిళపై లైంగిక దాడికి యత్నించి ఆమె నిరాకరించడంతో మహిళను హత్య చేసిన నిందితుడిని అక్కడి ప్రజలు రాళ్లతో కొట్టి చంపిన సంఘటన మరువక ముందే గుంటూరులో ఇంజనీరింగ్ విద్యార్థినిపై కొందరు అత్యాచారయత్నానికి పాల్పడ్డారు.

తాడికొండ మండల పరిధి మోతడకలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న యువతి తన ఫ్రెండ్ తో కలిసి గురువారం గుంటూరుకు బయల్దేరింది. ప్రయాణ సమయంలో కాసేపు రోడ్డు పక్కన ఆగారు. అక్కడే ఉన్న కొందరు యువకులు కర్రలతో దాడి చేసి.. యువతిని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లేందుకు యత్నించారు. యువతి కేకలు వేయడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

గురువారం రాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో బాధిత యువతి, ఆమె స్నేహితులు ఇవాళ తాడికొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.