శ్రీలంక ప్రధానిగా విక్రమసింఘే ..

,

శ్రీలంక కొత్త ప్రధానమంత్రిగా రణిల్ విక్రమసింఘే ప్రమాణ స్వీకారం చేసారు. శ్రీలంకలో గత కొన్నిరోజులుగా నిరసన జ్వాలలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీలంకలో కీలక రాజకీయ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తీవ్ర ఒత్తిడికి తలొగ్గి ప్రధాని పదవి నుంచి మహింద రాజపక్స రాజీనామా చేయగా..ఇప్పుడు ఆ స్థానంలో విక్రమసింఘే ప్రమాణ స్వీకారం చేశారు. ప్రెసిడెంట్‌ భవనంలో ఆయన కొత్త ప్రధానమంత్రితో అధ్యక్షుడు గోటబయ రాజపక్స ప్రమాణ స్వీకారం చేయించారు.

విక్రమసింఘే ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడం ఇది ఐదోసారి. తొలిసారిగా 1993-1994 వరకు ప్రధానిగా పని చేశారు. ఆ తర్వాత 2001-2004, 2015-2018 అక్టోబర్‌ వరకు, 2018 డిసెంబర్‌ నుంచి 2019 ప్రధానిగా సేవలందించారు. స్వాతంత్య్రం అనంతరం తొలిసారిగా శ్రీలంక తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. విదేశీ మారకద్రవ్యం నిలువలు తగ్గిపోవడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

ఇదిలా ఉండగా.. ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులపై హింసాత్మక చర్యలకు పాల్పడినందుకు మాజీ ప్రధాని మహింద రాజపక్సతో పాటు 15 మంది ఆయన అనుయాయులు దేశం విడిచి వెళ్లకుండా గురువారం శ్రీలంక కోర్టు నిషేధం విధించింది. రాజధాని కొలంబోలోని మేజిస్ట్రేట్‌ కోర్టు హింసపై దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించింది. మహింద రాజీనామా అనంతరం జరిగిన హింసలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయి.. భారీగా ఆస్తి నష్టం జరిగింది.