ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు.. రామచంద్ర పిళ్లైకి బెయిల్ మంజూరు

భార్య అనారోగ్యంతో ఉందంటూ పిళ్లై బెయిల్ పిటిషన్

ramachandra-pillai-gets-bail-in-delhi-liquor-scam-case

న్యూఢిల్లీః ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడు, వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైకి కోర్టు బెయిల్ ఇచ్చింది. ఈమేరకు భార్య అనారోగ్యంతో ఉందంటూ బెయిల్ కోసం పిళ్లై దరఖాస్తు చేసుకున్న పిటిషన్ పై సానుకూలంగా స్పందించింది. ఆసుపత్రిలో చేరిన భార్యను దగ్గరుండి చూసుకోవడం కోసం రెండు వారాలు బెయిల్ మంజూరు చేస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని.. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయన అప్రూవర్ గా మారారు. పిళ్లై వెల్లడించిన వివరాలతో ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగాయి. ఈ క్రమంలో 8 వారాల బెయిల్ కోసం పిళ్లై చేసుకున్న దరఖాస్తును సీబీఐ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి ఎంకే నాగ్ పాల్ సోమవారం విచారించారు. పిళ్లై తరఫున న్యాయవాది నితీశ్ రాణా బెయిల్ కోసం వాదనలు వినిపించారు. తన క్లయింట్ భార్య ఆసుపత్రి పాలైందని, ఆమెను చూసుకోవడానికి అయినవాళ్ళు ఎవరూ లేరని కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది.