అనర్హత వేటుపై స్పందించిన రాహుల్..జైలుకు పంపించినా తగ్గేది లేదు

ప్రధాని మోడీ ఇంటి పేరు కలవారందరూ దొంగలే అంటూ వ్యాఖ్యానించి రెండేళ్ల జైలుశిక్ష పొందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ పై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. దీనిపై యావత్ ప్రతిపక్ష పార్టీలు ఖండిస్తున్నాయి. ఈ క్రమంలో అనర్హత వేటుపై రాహుల్ స్పందించారు. దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని రాహుల్ అన్నారు. తాను ఎవరికీ భయపడనని, జైలుకు పంపించినా తగ్గేది లేదని తేల్చి చెప్పారు. తాను ఒకటే ప్రశ్న అడిగానని, అదానీ, మోడీ స్నేహం గురించి పార్లమెంట్‌లో మాట్లాడినట్లు తెలిపారు. అదానీ షెల్ కంపెనీలలో రూ.20 వేల కోట్లు ఎవరు పెట్టుబడి పెట్టారని, ఈ 20 వేల కోట్లు ఎవరివి? అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

నిబంధనలు మార్చి అదానీకి ఎయిర్‌పోర్టులు ఇచ్చారని, కేంద్రమంత్రులు పార్లమెంట్‌లో అబద్ధాలు చెప్పారని అన్నారు. తాను విదేశీ శక్తుల నుంచి సమాచారం తీసుకున్నానని మంత్రులు అబద్ధం చెప్పారని, తాను రెండు లేఖలు రాస్తే దానికి జవాబు లేదన్నారు. స్పీకర్‌ను కలిసి మాట్లాడేందుకు సమయం ఇవ్వమంటే నవ్వి వదిలేశారని, తాను దేశ ప్రజాస్వామ్యం కోసం పోరాడానని తెలిపారు. ‘నాకు జైలు శిక్షా? ఐ డోంట్ కేర్.. ప్రజల్లోకి వెళ్లడం ఒక్కటే ఇప్పుడు విపక్షాలకు ఉన్న అవకాశం. నాకు మద్దతుగా ఉన్న విపక్షాలన్నింటికి ధన్యవాదాలు. నేను ఏ ప్రశ్న అడిగినా ఆలోచించే అడుగుతాను. పార్లమెంట్ లోపల ఉన్నా, బయట ఉన్నా నా పని నేను చేసుకుంటూ పోతాను. అనర్హత వేటు ఉన్నా, లేకున్నా నా పని నేను చేసుకుంటూ పోతా. అదానీతో మా ముఖ్యమంత్రులకు సంబంధం ఉందని తేలితే వాళ్లను జైల్లో వేయండి. వేరేవాళ్లు ఎవరైనా ఉంటే వాళ్లను జైల్లో వేయండి. అదానీని మోదీ ఎందుకు రక్షిస్తున్నారని ప్రజలంతా ప్రశ్నిస్తున్నారు’ అని రాహుల్ గాంధీ అన్నారు.