బంగళా ఖాళీ చేస్తా..ప్రభుత్వ లేఖకు రాహుల్ రిప్లై

ఏప్రిల్ 23 లోపు ఖాళీ చేయాలంటూ ప్రభుత్వం డెడ్‌లైన్

rahul-gandhi-to-vacate-mp-bungalow

న్యూఢిల్లీః రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యులకు కేటాయించే అధికారిక బంగళాను ఖాళీ చేయాలంటూ కేంద్ర జారీ చేసిన నోటీసులపై తాజాగా స్పందించారు. ప్రభుత్వ నోటీసులకు కట్టుబడి ఉంటానన్న ఆయన బంగళా ఖాళీ చేస్తానంటూ ప్రభుత్వానికి లేఖ రాశారు. మోడీ పేరుపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో రాహుల్ దోషిగా తేలడంతో ఆయన లోక్‌సభ సభ్యత్వం కూడా ఆటోమేటిక్‌గా రద్దయిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంపీగా ఆయనకు గతంలో కేటాయించిన అధికారిక భవనాన్ని కూడా ఖాళీ చేయాలంటూ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 23 లోగా ఖాళీ చేయాలని స్పష్టం చేసింది. ఢిల్లీలోని తుగ్లక్ లేన్‌లో రాహుల్ అధికారిక నివాసం ఉంది.

కేంద్ర నోటీసులకు రాహుల్ తాజాగా స్పందించారు. ‘‘నాలుగు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన నేను ఇక్కడే గడిపాను. ఈ భవనంతో ఎన్నో మధురస్మృతులు ముడిపడి ఉన్నాయి. వాటన్నిటీ కారణం ప్రజలే’’ అని ఆయన తన లేఖలో రాసుకొచ్చారు. ప్రభుత్వం తనకు పంపిన నోటీసులో అంశాలకు కట్టుబడి ఉంటానని కూడా రాహుల్ స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ తొలిసారిగా 2004లో ఎంపీగా పార్లమెంటులో కాలుపెట్టారు. 2005 నుంచి తుగ్లక్ లేన్‌లోని బంగళాలో ఉంటున్నారు. ఇప్పటివరకూ ఆయన నాలుగు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.