పార్లమెంట్‌లో నేడు అవిశ్వాస తీర్మానంపై రాహుల్‌ ప్రసంగం..!

Rahul Gandhi to begin no-confidence motion debate against Modi govt today

న్యూఢిల్లీః కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోక్‌సభలో కాంగ్రెస్‌ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ అంశంపై మంగళవారం రోజున చర్చ ప్రారంభమైంది. బిజెపి-ఇండియా కూటమి ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. అయితే ఈరోజు కూడా ఈ చర్చ కొనసాగనుంది. అవిశ్వాస తీర్మానంపై ఈరోజు.. విపక్ష కాంగ్రెస్‌ పార్టీలోని కీలక నేతలు ప్రసంగించనున్నారు.

నేడు పార్టీ తరఫున గళం విప్పేందుకు రాహుల్‌ గాంధీ, రేవంత్‌ రెడ్డి, హిబి ఇడన్‌ పేర్లను పంపినట్లు పార్టీకి చెందిన మాణిక్కం ఠాగూర్ పేర్కొన్నారు. పరిస్థితులను బట్టి ప్రసంగాల క్రమంలో మార్పులు ఉండొచ్చని వెల్లడించారు. రాహుల్‌ ఎంపీ పదవిని పునరుద్ధరించిన తర్వాత ఆయన పార్లమెంట్‌లో తొలిసారి ప్రసంగించనున్నారు. దీంతో ప్రభుత్వాన్ని ఆయన ఏవిధంగా ఇరుకున పెడతారనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. వాస్తవానికి రాహుల్‌ నిన్ననే ప్రసంగిస్తారని ప్రచారం జరిగినా.. అది వాయిదాపడింది.

అంతకంటే ముందు నేడు ఉదయం విపక్ష కూటమి అయిన ఇండియా (I.N.D.I.A.) నేతలు రాజ్యసభలోని ఎల్‌వోపీ ఛాంబర్‌లో సమావేశంమై సభలో అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చించనున్నారు. మరోవైపు అధికార పక్షమైన బిజెపి తరపున హోంశాఖ మంత్రి అమిత్‌షా నేడు లోక్‌సభలో మాట్లాడనున్నారు.