ఓటు అనే వ‌జ్రాయుధాన్ని స‌వ్యంగా వాడండి.. ఆగం కాకండి – కేటీఆర్

మునుగోడే ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. చివరి రోజు ప్రధాన పార్టీలు విస్తృతంగా పర్యటించి ఓటర్లను ఆకట్టుకున్నారు. గత నెల రోజులుగా ప్రశాంతంగా జరిగిన ప్రచారం..చివరి రోజు మాత్రం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. బిజెపి – టిఆర్ఎస్ కార్య కర్తలు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఇక చివరి రోజున టిఆర్ఎస్ మంత్రులు అంత ప్రచారం చేసారు. కేటీఆర్ ప్రచారంలో మాట్లాడుతూ..ఓటు అనే వ‌జ్రాయుధాన్ని స‌వ్యంగా వాడండి.. ఆగం కాకండి అని ఓటర్లకు సూచించారు. మొన‌గాళ్ల‌కు, మోస‌గాళ్ల‌కు మ‌ధ్య జ‌రుగుతున్న యుద్ధం ఇది అని తెలిపారు. టిఆర్ఎస్ తరుపున ప్ర‌చారంలో పాల్గొన్న‌ వామ‌ప‌క్షాల నాయ‌కుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు తెలిపారు.

మ‌నుగోడు మండ‌లం ప‌లివెల‌లో దాడుల‌కు దిగారు. గెలుస్త‌లేమ‌ని బోధ ప‌డిన త‌ర్వాత, చిల్ల‌ర‌గా భౌతిక‌దాడుల‌కు దిగింది బీజేపీ. ఆ దాడుల్లో టీఆర్ఎస్ నాయ‌కులకు తీవ్ర గాయాలయ్యాయని అన్నారు. మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలో ద‌శాబ్దాలుగా ప‌రిష్కారం కానీ ప‌నుల‌ను చేసి చూపించామ‌ని కేటీఆర్ తెలిపారు. తాగునీటి స‌మ‌స్య‌తో స‌త‌మత‌మ‌వుతున్న మునుగోడుకు మిష‌న్ భ‌గీర‌థ‌తో శాశ్వ‌త ప‌రిష్కారం చూపించాం. ఫ్లోరోసిస్ ను నిర్మూలించాం. రాజీనామా చేసిన రాజ‌గోపాల్ రెడ్డి అనాథ‌లా మునుగోడును వ‌దిలిపెట్టిన‌ప్ప‌టికీ, అభివృద్ధి, సంక్షేమం ఆగ‌లేదు. రైతుల‌కు 24 గంట‌ల క‌రెంట్ ఇచ్చాం. రైతుబంధు, రైతుబీమా అమ‌లు చేశాం. శివ్వ‌న్న‌గూడెం, ల‌క్ష్మ‌ణాపురం ప్రాజెక్టుల నిర్మాణం శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. కృష్ణా జ‌లాల విష‌యంలో మోడీ తాత్స‌రం చేస్తున్నారు. ఒక వేళ అది పూర్తి చేసి ఉంటే ప్రాజెక్టులు ఇప్ప‌టికే పూర్త‌య్యేవి. ఇంటింటికీ టీఆర్ఎస్ సంక్షేమ ప‌థ‌కాలు అందుతున్నాయని అన్నారు. మునుగోడు ఓట‌ర్లు తేల్చుకోవాలి. ఎటు వైపు ఉండాలో ఆలోచించుకోని ఓటు వేయండి. బీజేపీ ప్ర‌లోభాల‌కు లొంగ‌కండి. కెలికి క‌య్యం పెట్టుకుని ఓట‌ర్ల‌ను ఆందోళ‌న‌కు గురి చేస్తారు. టీఆర్ఎస్ శ్రేణులు సంయ‌మ‌నం పాటించండి. అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచేంత మంచి మెజార్టీతో గెలుస్తాం అన్నారు.