4 నెలల తర్వాత లోక్ సభలో అడుగుపెట్టిన రాహుల్ గాంధీ

మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళి అర్పించిన కాంగ్రెస్ అగ్రనేత

rahul-gandhi-reaches-parliament-after-4-months

న్యూఢిల్లీః కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దాదాపు 4 నెలల తర్వాత మళ్లీ పార్లమెంటులో అడుగుపెట్టారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాహుల్ లోక్ సభ సభ్యత్వంపై విధించిన నిషేధాన్ని ఈ ఉదయం ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ఎంపీగా తన సభ్యత్వాన్ని పునరుద్ధరించడంతో ఆయన పార్లమెంటుకు వచ్చారు. మార్చ్ 24న రాహుల్ గాంధీ సభ్యత్వంపై నిషేధం విధించారు.

మరోవైపు, పార్లమెంటుకు వచ్చిన రాహుల్ తొలుత మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు. అనంతరం పార్లమెంటు భవనంలోని వెళ్లారు. ఈ సందర్భంగా రాహుల్ కు ఇండియా కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. రాహుల్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. మోడీ ప్రభుత్వంపై విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. రేపు లోక్ సభలో ఈ తీర్మానంపై చర్చ ప్రారంభంకానుంది. అవిశ్వాస తీర్మానంపై చర్చకు ఒక రోజు ముందు రాహుల్ పార్లమెంట్ లో అడుగుపెట్టడం కీలక పరిణామంగా భావించవచ్చు.