విజయనగరం రైలు ప్రమాదం..మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపంః రాహుల్ గాంధీ

Rahul Gandhi is deeply shocked by the train accident incident

న్యూఢిల్లీః విజయనగరం రైలు ప్రమాద ఘటనలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఏడు బృందాలు రెస్క్యూలో నిమగ్నమయ్యాయి. ఈ ఘటనలో ఇప్పటికే 14 మంది మరణించగా.. అందులో 11 మంది వివరాలు లభ్యమయ్యాయి. తాజాగా విజయనగరం రైలు ప్రమాద ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఇందులో గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు ఈ ఘటన జరిగిన ప్రాంతంలో సహాయక చర్యల్లో తమ వంతు సహాయ సహకారాలు అందించాలని రాహుల్‌ సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మృతుల కుటుంబాలకు అండగా ఉండాలని కోరారు.

కాగా, ఈ ఘటనపై దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై స్పందించిన ప్రధాని మోడీ.. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. అదే విధంగా మృతులకు, గాయపడిన వారికి పరిహారం ప్రకటించారు. మరోవైపు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ రైల్వే శాఖ తరఫున పరిహారం ప్రకటించారు.