తెలంగాణ రాష్ట్రం మంచి చేనేత వస్త్రాలను అందిస్తోందిః రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

నేత పరిశ్రమతో గ్రామీణ ప్రాంతప్రజలకు మంచి ఉపాధి దొరుకుతోందన్న రాష్ట్రపతి

president-draupadi-murmu-at-pochampalli-tour

హైదరాబాద్‌ః తెలంగాణ రాష్ట్రం మంచి చేనేత వస్త్రాలను అందిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. బుధవారం చేనేత కార్మికులతో ఏర్పాటు చేసిన థీమ్ పెవిలియన్ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ద్రౌపదిముర్ము మాట్లాడుతూ… నేత పరిశ్రమతో గ్రామీణ ప్రాంతప్రజలకు మంచి ఉపాధి దొరుకుతోందన్నారు. పోచంపల్లి చేనేత వస్త్రాలను చూస్తే తనకు చాలా సంతోషం కలిగిందన్నారు. భారత సంస్కృతీ సాంప్రదాయాల్లో చేనేత ఒకటి అన్నారు.

భూధాన్ పోచంపల్లిని ప్రపంచ గ్రామీణ పర్యాటక ప్రాంతంగా గుర్తించడం అభినందనీయమని పేర్కొన్నారు. చేనేత వస్త్రాల కృషి గొప్పదని… కళను వారసత్వంగా మరొకరికి అందించడం గొప్ప విషయమన్నారు. చేనేత రంగాన్ని కాపాడుకునే విధంగా కృషి చేయాలని సూచించారు. చేనేత అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తమ ప్రాంత ప్రజలను పోచంపల్లికి తీసుకువస్తానని రాష్ట్రపతి అన్నారు.

కాగా, శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన ఆమె.. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో పోచంపల్లికి వెళ్లారు. ముందుగా పట్టణంలోని టూరిజం సెంటర్‌, ఆచార్య వినోబాబావే భవనానికి వెళ్లిన రాష్ట్రపతి.. భూదాన ఉద్యమకారులైన వినోబాబావే, వెదిరె రామచంద్రారెడ్డి విగ్రహాలకు నివాళులర్పించారు. అనంతరం వినోబాబావే భవనంలో ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. పోచంపల్లి టై అండ్‌ డై, ఇక్కత్‌ చీరెలను తయారీని పరిశీలించారు. అంతకు ముందు అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.