ఏపీలో శ్రీరాముడికి తప్పని కరెంట్ కష్టాలు

ఏపీ రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిపోయింది. గత పది రోజులుగా రాష్ట్రంలో కరెంట్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. బయట ఎండ..లోపల ఉక్కపోతతో జనాలు నరకం చూస్తున్నారు. ఈ కరెంట్ కష్టాలు సామాన్య ప్రజలకే కాదు శ్రీరాముడికి కూడా తప్పలేదు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సమీపంలోని వాల్మీకిపురంలో కొలువైన పట్టాభి రాముడికి టీటీడీ ఆధ్వర్యంలో మూడు రోజులుగా ఘనంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. కాకపోతే ఈ బ్రహ్మోత్సవాలు చీకట్లోనే ఈ సంబరాలు కొనసాగుతున్నాయి.

శుక్రవారం రాత్రి సింహ వాహనంపై సీత, లక్ష్మణ సమేత రాముడు ఊరేగింపు మొదలైంది. పట్టణ నడిబొడ్డున LR వీధిలోకి స్వామివారి వాహనం వచ్చేసరికి కరెంట్ పోయింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో సుమారు అర గంట పాటు స్వామి వారు చీకట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. చివరికి మహిళలు చేతిలో దీపాలతో స్వామి వారికి దారి చూపించి ముందుకు వెళ్లారు. ఈ కోతల ఫై ప్రజలు , ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.