చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న జలప్రళయం..

వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తుండంతో జనజీవనం అస్తవేస్తమైంది. ముఖ్యముగా చిత్తూరు జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తిరుమల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఘాటు రోడ్లు మూసివేశారు. భక్తులెవర్నీ కొండపైకి అనుమతించడం లేదు. ప్రస్తుతం దెబ్బతిన్న తిరుమల ఘాట్‌ రోడ్డును అధికారులు పునరుద్ధరించారు. ఘూట్‌ రోడ్లపై విరిగిపడిన కొండచరియలను యుద్ధప్రాతిపదికన టీటీడీ అధికారులు తొలగించారు. రెండు ఘాట్‌ రోడ్లలో భక్తులను అనుమతించాలని నిర్ణయించారు. ప్రస్తుతం జిల్లాలో జలప్రళయం కొనసాగుతోంది. కనుచూపుమేర ఎటుచూసినా వరద బీభత్సమే కనిపిస్తోంది.

జిల్లాలో ఇప్పటివరకు 543 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోగా, 700 విలేజెస్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. 1221 గ్రామాలకు విద్యుత్ సరఫరా బంద్ అయ్యింది. జిల్లావ్యాప్తంగా 160 చెరువులకు గండి పడింది. 70 చోట్ల రహదారులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. సుమారు 220 కిలోమీటర్ల మేర రోడ్లు కొట్టుకుపోయాయి. ఇప్పటివరకు ఐదుగురు మరణించారు. రాజంపేట మండలం రామాపురం రోడ్డుపై రెండు బస్సులు నీటిలో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఈ రెండు బస్సుల్లో ఉన్న ప్రయాణికులను రక్షించేందుకు పోలీసులు, ఫైర్‌ సిబ్బంది రంగంలోకి దిగారు. ఇందులో భాగంగానే ఒక్కొక్కరిని నెమ్మదిగా బయటకు తీసుకొచ్చారు.