అమిత్ షా పర్యటనను వ్యతిరేకిస్తూ పరేడ్ గ్రౌండ్స్‌లో పోస్టర్ల కలకలం

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోచన వజ్రోత్సవ వేడుకలు జరుపుతుంది బిజెపి. ఈ వేడుకలకు ముఖ్య అతిధులుగా కేంద్ర మంత్రులు అమిత్ షా , రాజ్నాధ్ లు హాజరుకాబోతున్నారు. ఈనెల 16, 17 తేదీల్లో అమిత్‌ షా హైదరాబాద్‌ పర్యటించనున్నారు. 16న అమిత్ షా హైదరాబాద్‌కు చేరుకుంటారు. 17న ఉదయం 8 గంటలకు పరేడ్‌ గ్రౌండ్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఇందుకోసం రాష్ట్ర బీజేపీ నేతలు భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారు. ఇదిలా ఉంటె అమిత్ షా పర్యటనను వ్యతిరేకిస్తూ పరేడ్ గ్రౌండ్స్‌లో పోస్టులు వెలువడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.

గతంలో హైదరాబాద్ లో బిజెపి ఏర్పటు చేసిన సమావేశాల సమయంలో నగరవ్యాప్తంగా బిజెపికి వ్యతిరేకంగా పోస్టర్లు , ప్లెక్సీ లు ఏర్పటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి అదే మాదిరిగా కేంద్రానికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిసాయి. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఏ విధంగా సాయపడిందో చెప్పాలని డిమాండ్ చేస్తూ పరేడ్ గ్రౌండ్స్ పరిధిలో పోస్టర్లు కనిపించాయి. కంటోన్మెంట్ యువత పేరుతో వెలిసిన ఈ పోస్టర్లలో కేంద్ర ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధించారు.

తెలంగాణ ఆత్మగౌరవాన్ని అమిత్ షా చెప్పుల దగ్గర పెట్టిన నాయకుడు ఎవరో చెప్పుకోవాలంటూ కొన్ని పోస్టర్లు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ పరిధిలో వెలిశాయి. అమిత్ షా సభను ఉద్దేశించి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిన నాయకులు వీళ్లే అంటూ మరికొన్ని పోస్టర్లు కనిపించాయి. కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ రాష్ట్రానికి అభివృద్ధి విషయంలో ఏ విధంగా సహకరించారో చెప్పాలంటూ 20 ప్రశ్నలతో కూడిన పోస్టర్లు కలకలం సృష్టించాయి.