ఏలూరు పోరస్ కంపెనీ తాత్కాలికంగా మూసివేత
ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం పోరస్ కెమికల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 6 గురు మృతి చెందగా..13మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. రసాయన పరిశ్రమలోని నాలుగో యూనిట్‌లో మంటలు చెలరేగి.. రియాక్టర్ పేలడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను నూజివీడు ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమించటంతో.. మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. ప్రస్తుతం కెమికల్ కంపెనీ వద్ద ఉత్కంఠ నెలకొని ఉంది. కంపెనీ మూసివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
గ్రామస్తులు ఫ్యాక్టరీ వద్ద చెట్లు, దుంగలను అక్కిరెడ్డిగూడెం రోడ్డుకు అడ్డంగా వేశారు. ఈ క్రమంలో పోలీసులకు గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఫ్యాక్టరీని వెంటనే ఇక్కడి నుంచి తీసివేయాలి అని నినాదాలు చేశారు. రోడ్డుకు అడ్డంగా వేసిన దుంగలను గ్రామస్తులు తీయకపోవడంతో పోలీసులు వాటిని తొలగించారు.
ఈ క్రమంలో క్షతగాత్రులకు చికిత్స జరుగుతున్నంత కాలం పోరస్ కంపెనీ వేతనం అందిస్తుందని ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. ప్రస్తుతానికి పోరస్ కంపెనీని తాత్కాలికంగా మూసేస్తున్నట్టు ప్రకటించారు. ‘కంపెనీ నిబంధనలు ఏమైనా ఉల్లంఘించిందా..? ప్రమాదకర రసాయనాల వినియోగం ఏమైనా ఉందా..?’ అనే అంశాలపై విచారణ చేపడుతున్నామన్నారు.