నేడు రాష్ట్రపతి ఎన్నిక..

ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్

polling-for-presidential-election-to-be-held-today

న్యూఢిల్లీః నేడు 15వ రాష్ట్రపతి ఎన్నికలు ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో ఉన్నారు. ఈ ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న ఓటింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. పార్లమెంటుతోపాటు ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో ఓటింగ్ నిర్వహిస్తారు. పార్లమెంటులో ఎంపీలు, అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. కాగా, ఈసారి 9 మంది ఎమ్మెల్యేలు పార్లమెంటులో, 44 మంది ఎంపీలు ఆయా రాష్ట్రాల శాసనసభల్లో ఓటు వేయనున్నారు. ఈ మేరకు రాజ్యసభ సచివాలయం తెలిపింది. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 21 మంది లోక్‌సభ సభ్యులు, 13 మంది రాజ్యసభ సభ్యులు కోల్‌కతాలోని శాసనసభలో ఓటుహక్కు వినియోగించుకోనుండగా, ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన పరిమళ్ నత్వానీ గాంధీనగర్‌లోని గుజరాత్ అసెంబ్లీలో ఓటుహక్కు వినియోగించుకుంటారు.

ఇక ఈ ఎన్నికల్లో బ్యాలెట్‌ను ఉపయోగిస్తున్నారు. ఎలక్టోరల్ కాలేజీలో 10.81 లక్షల ఓట్లు ఉండగా, మెజారిటీ పార్టీలన్నీ ముర్ముకే మద్దతు ప్రకటించిన నేపథ్యంలో 6.66 లక్షల ఓట్లు ముర్ముకు దక్కే అవకాశం ఉందని అంచనా. ఈ నెల 21న ఓట్లను లెక్కించి అదే రోజు రాత్రి ఫలితాన్ని వెల్లడిస్తారు. 25న నూతన రాష్ట్రపతి ప్రమాణస్వీకారం చేస్తారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల తరఫు అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఎంపీలు ఆకుపచ్చ రంగు బ్యాలెట్‌ పత్రాల్లో, ఎమ్మెల్యేలు పింక్‌ రంగు బ్యాలెట్‌ పత్రాల్లో తమ ఓటు వేయనున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/