బిఆర్ఎస్, కాంగ్రెస్ నేతల సవాళ్లు.. కామారెడ్డిలో టెన్షన్ వాతావరణం

టెక్రియాల్ చేరుకున్న అలీ.. గోవర్ధన్ రాక కోసం ఎదురుచూపు

shabbir ali

హైదరాబాద్‌ః బిఆర్ఎస్, కాంగ్రెస్ నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లతో కామారెడ్డిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టెక్రియాల్ లో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూంల నాణ్యతపై ఎమ్మెల్యే గంప గోవర్ధన్, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎమ్మెల్యే విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన షబ్బీర్ అలీ.. సోమవారం అనుచరులతో కలిసి టెక్రియాల్ చేరుకున్నారు. ఉదయం పదిగంటలకే టెక్రియాల్ చేరుకున్న అలీ.. ఎమ్మెల్యే రాక కోసం టెంటు వేసుకుని కూర్చున్నారు.

ఏంటీ ఛాలెంజ్..

టెక్రియాల్ లో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల నాణ్యతపై షబ్బీర్ అలీ విమర్శలు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ఈ ఇళ్లల్లోకి వెళ్లేందుకు లబ్దిదారులు భయపడుతున్నారని, నాణ్యత అనేది మచ్చుకు కూడా కనిపించకుండా డబుల్ బెడ్రూంలు కట్టారని ఆరోపించారు. దీనిపై బిఆర్ఎస్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మండిపడ్డారు. తమ ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుంటే షబ్బీర్ అలీ ఓర్వలేకపోతున్నారని, అందుకే తప్పుడు ప్రచారంతో ప్రజలను భయపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు.

డబుల్ బెడ్రూంల నాణ్యతకు ఢోకా లేదని, యాభై ఏళ్లకు పైగా చెక్కుచెదరకుండా ఉంటాయని అన్నారు. ఇంజనీర్లను తీసుకుని రావాలని, తాను కూడా ఇంజనీర్లతో వస్తానని.. డబుల్ బెడ్రూం ఇళ్ల నాణ్యతను చూపిస్తానని షబ్బీర్ అలీకి సవాల్ విసిరారు. దీనిని స్వీకరించిన షబ్బీర్ అలీ సోమవారం ఉదయం టెక్రియాల్ చేరుకున్నారు.

డబుల్ బెడ్రూంల పరిశీలన..

టెక్రియాల్ లోని డబుల్ బెడ్రూంల నాణ్యతను పరిశీలించేందుకు ఇంజనీర్లు అవసరంలేదని, బిల్డింగ్ కట్టే మేస్త్రీలు చాలని షబ్బీర్ అలీ చెప్పారు. అందుకే వారితోనే వచ్చానని టెక్రియాల్ లో మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. అవసరమైతే ఇంజనీర్లను కూడా పిలిపిస్తామని వివరించారు. ఎమ్మెల్యే గంప గోవర్ధన్ టెక్రియాల్ వచ్చి, డబుల్ బెడ్రూం ఇళ్ల నాణ్యతను చూపెట్టేదాకా ఇక్కడి నుంచి వెళ్లేదిలేదని షబ్బీర్ అలీ స్సష్టంచేశారు. ఈ సందర్భంగా అక్కడున్న మీడియాకు డబుల్ బెడ్రూం ఇళ్ల గోడలకు ఏర్పడిన పగుళ్లను, కర్రముక్కతో తడితే పెచ్చులూడుతున్న వైనాన్ని షబ్బీర్ అలీ ప్రత్యక్షంగా చూపించారు.