మంత్రి పేర్ని నాని తో ముగిసిన వర్మ భేటీ..

డైరెక్టర్ వర్మ – ఏపీ మంత్రి పేర్ని నాని ల మధ్య భేటీ ముగిసింది. గత కొద్దీ రోజులుగా ఏపీలో సినిమా టికెట్ ధరల విషయంలో వర్మ ..సర్కార్ ఫై సోషల్ మీడియా ద్వారా ఫైట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో నాల్గు రోజుల క్రితం వర్మ కు పేర్ని నాని సినిమా టికెట్ ధరల విషయంలో మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు. ఈ తరుణంలో ఈరోజు వర్మ ..పేర్ని నాని తో భేటీ అయ్యారు. దాదాపు రేణు గంటల పాటు భేటీ అయ్యారు. భేటీ అనంతరం టాలీవుడ్ దర్శకుడు వర్మ మీడియా తో మాట్లాడారు.

మంత్రి పేర్నినానితో చర్చలు సంతృప్తిగా పూర్తిఅయ్యాయి. సినిమా టిక్కెట్ల రేట్లపై నా అభిప్రాయాన్ని చెప్పానని.. ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం వస్తుందని భావిస్తున్నానని వెల్లడించారు. రేట్ల తగ్గింపు తో సినిమా క్వాలిటీ దెబ్బతింటుందని… అందుకే సినిమా తీసిన నిర్మాత ధరను నిర్ణయించుకోవాలని ప్రభుత్వానికి వెల్లడించినట్టు చెప్పుకొచ్చారు. థియేటర్ల మూసివేత.. నాకు సంబంధించిన అంశం కాదన్నారు. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ ఇదంతా ప్రభుత్వం చేస్తుందని తాను అనుకోవడం లేదని వర్మ పేర్కొన్నారు. తాను ఒక సినిమా నిర్మాతగానే ఇక్కడికి వచ్చానని మరోసారి గుర్తు చేశారు. నేను ట్విట్టర్ లో పెట్టిన అన్ని ప్రశ్నలు మంత్రి పేర్ని నాని దగ్గర చెప్పానని.. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం జరగలేదన్నారు. ఈ సమస్యకు కంక్లూజిన్ ఇచ్చే పవర్ నాకు లేదని.. మాన్యుఫాక్చరర్ కు వినియోగదారులకు మధ్య ప్రభుత్వం ఎందుకు ఉండాలి అన్నదే నా ప్రశ్న అని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటె గత కొద్దీ రోజులుగా ప్రభుత్వం నిర్ణయించిన ధరల విషయంలో అటు డిస్ట్రిబ్యూటర్లు, ఇటు ఎగ్జిబిటర్లు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు థియేటర్లను నడపడం సాధ్యం కాదని పలువురు స్వచ్ఛందంగానే థియేటర్లను మూసివేశారు. రాష్ట్రంలో సుమారుగా 1200 థియేటర్లు ఉండగా, వాటిలో ఇప్పటి వరకు ఇలా 240 వరకు మూతపడ్డాయి. సినిమా టికెట్ల వ్యవహారం సినీ పెద్దల, ఏపీ మంత్రుల మధ్య దుమారం చెలరేగింది. సినిమా టికెట్ ధరలపై ప్రభుత్వం ఓ కమిటీని కూడా నియమించడం జరిగింది .