పవన్ కళ్యాణ్ కు పేర్ని నాని కౌంటర్

వైసీపీ మంత్రి పేర్ని నాని మరోసారి పవన్ కళ్యాణ్ ఫై మండిపడ్డారు. దేశంలో కిరాయికి రాజకీయ పార్టీ పెట్టింది పవన్ కళ్యాణ్ అంటూ విరుచుకపడ్డారు. బుధవారం తెలుగు సినీ నిర్మాతలతో సమావేశం ముగిసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాతూ.. ఆన్‌లైన్‌ టికెటింగ్‌ కొత్తగా ప్రభుత్వం పెట్టింది కాదని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమ ఆన్‌లైన్‌ టికెటింగ్‌కు అనుకూలంగా ఉందని తెలిపారు. సినిమా టికెట్లపై నిర్ధిష్ట విధానం అవసరమని గుర్తుచేశారు. ఇప్పటికే ఆన్‌లైన్‌ టికెటింగ్‌ విధానం కొనసాగుతోందని, ఇది కొత్తగా ప్రభుత్వం పెట్టింది కాదని మంత్రి చెప్పారు.

పవన్ కళ్యాణ్ దేశంలో కిరాయి రాజకీయ పెట్టారని ఆరోపించారు. రాజకీయ పార్టీని టెంట్‎హౌస్‎లా అద్దెకు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆడియో ఫంక్షన్‎లో జరిగిన దానిపై మెగాస్టార్ చిరంజీవి తనతో మాట్లాడారని నాని చెప్పారు. ఆడియో ఫక్షన్ వ్యాఖ్యలపై చిరంజీవి విచారం వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఆడియో ఫక్షన్‎లో జరిగిన దానికి ఇండస్ట్రీకి సంబంధం లేదని చిరంజీవి చెప్పినట్లు మంత్రి వివరించారు. పవన్‌ అభిప్రాయలకు తాము అనుకూలంగా లేమని, పవన్‌ వ్యాఖ్యలకు తమకు సంబంధం లేదని నిర్మాతలు స్పష్టం చేసినట్లు మంత్రి నాని వివరణ ఇచ్చారు. పరిశ్రమను బతికించేందుకు ప్రభుత్వం ఇచ్చే సూచనలు, సలహాలు పాటించేందుకు తాము సిద్దమని నిర్మాతలు చెప్పారని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో నిర్మాతలు దిల్‌ రాజు, బన్నీ వాసు, సునీల్‌ నారంగ్‌, వంశీ రెడ్డి, మైత్రీ మూవీ మేకర్స్‌ నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.