అక్టోబర్‌లో తిరుపతి నుంచి పవన్ బస్సు యాత్ర..

ఏపీలో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుండే ప్రజల మధ్యకు వెళ్లేందుకు అన్ని రాజకీయ పార్టీలు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ నెల మూడో వారం నుండి టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర వ్యాప్త టూర్ మొదలుపెడుతుండగా..తాజాగా జనసేన అధినేత కూడా ప్రజల మధ్యకు వెళ్లేందుకు డిసైడ్ అయ్యారు. ఈ మేరకు ప్రకటన చేసారు. అక్టోబర్ నుండి పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్త యాత్ర మొదలుపెట్టబోతున్నాడు.

అక్టోబర్ 5వ తేదీన తిరుపతి నుంచి పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆరు నెలల పాటు రాష్ట్రమంతా పర్యటించి.. ప్రతీ ఉమ్మడి జిల్లాలో బహిరంగ సభలో పాల్గొంటారు. దీనికి సంబంధించి షెడ్యూల్ కు తుది రూపు ఇస్తున్నారు. ఇప్పటికే పొత్తుల పైన వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాల్లో వేడి పెంచిన పవన్ కళ్యాణ్.. తన పర్యటనల ద్వారా పార్టీలో జోష్ పెంచటంతో పాటుగా తన సత్తా చాటేందుకు సిద్దమయ్యారు. 2024లో జరగాల్సిన ఎన్నికలు ఏడాది ముందుగానే 2023 మార్చి – ఏప్రిల్ లోనే ఎన్నికలు ఉంటాయంటూ మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. జగన్ పాలనలో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, ప్రణాళిక లేని పాలన వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. జగన్ వర్క్ ఫ్రం హోం సీఎం అని, ప్రభుత్వాన్ని నడపడం చేతకాకే చేతులు ఎత్తేశాడని విమర్శించారు. అందుకే వచ్చే మార్చిలో జగన్ ఎన్నికలకు వెళతాడని, దీనిపై తమ వద్ద పక్కా సమాచారం ఉందన్నారు. నిజాయితీకి నిదర్శనంగా ఉండే పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమని నాదెండ్ల మనోహర్‌ ధీమా వ్యక్తం చేశారు.

వైస్సార్సీపీ ప్రభుత్వ వైఫల్యాలే లక్ష్యంగా పవన్ కల్యాణ్ తన ప్రచారంలో ఫోకస్ చేయనున్నారు. పొత్తుల పైన మూడు ప్రత్యామ్నాయాలు సూచించిన పవన్.. బీజేపీ తో పాటుగా టీడీపీ నుంచి క్లారిటీ వచ్చిన తరువాత పొత్తుల అంశం పైన తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. బీజేపీతో తెగ తెంపులు చేసుకోకుండానే… తన ప్రజాబలం ఏంటో నిరూపించుకోవాలని పవన్ భావిస్తున్నారు. అయితే, అటు చంద్రబాబు – ఇటు పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటన తో వైస్సార్సీపీ పైన ఒత్తిడి పెరగనుంది.