సిద్దిపేట జిల్లాలో బతుకమ్మ వేడుకల్లో మహిళ హత్య

సిద్ధిపేట జిల్లాలో బతుకమ్మ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. బతుకమ్మ ఆడుతున్న ఓ మహిళను ఆమె భర్త అతి కిరాతకంగా హత్య చేయడం అక్కడివారిని భయబ్రాంతులకు గురి చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

సిద్దిపేట జిల్లా వీరాపూర్ లో స్వప్న అనే మహిళను స్థానికుడైన యాళ్ల ఎల్లారెడ్డికి ఇచ్చి పెళ్లి చేశారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆరేళ్ల వరకు వీరి కాపురం సజావుగా జరిగింది. తరువాత భార్యాభర్తల మధ్య గొడవలు, మనస్పర్థలు మొదలయ్యాయి. స్వప్న ఇదే గ్రామానికి చెందిన రమేశ్‌ అనే వ్యక్తితో 14 ఏళ్లుగా సహజీవనం చేస్తోంది. దీంతో ఎల్లారెడ్డి పలుమార్లు ఆమెతో గొడవకు దిగి చంపేస్తానని బెదిరించాడు.

ఆదివారం రాత్రి తోటి మహిళలతో బతుకమ్మ ఆడుతుండగా.. స్వప్న తలపై ఎల్లారెడ్డి ఇనుప రాడ్‌తో బలంగా మోదడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందింది. తల్లి ఎల్లమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్‌ఐ తిరుపతి కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.