వీరమల్లు కోసం యాక్షన్ మోడ్‌లోకి పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రం ప్రస్తుతం రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరోసారి పవన్ కళ్యాణ్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే పవన్ తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి లైన్‌లో పెడుతూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో పవన్ నటించబోయే సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైన సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు ‘హరిహర వీరమల్లు’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను చిత్ర యూనిట్ ఇటీవల అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో పవన్ సరికొత్త లుక్‌లో కనిపిస్తుండగా, తాజాగా ఈ సినిమా కోసం పవన్ యాక్షన్ మోడ్‌లోకి వెళ్లాడు. ప్రొఫెషనల్ ఫైట్ మాస్టర్ సమక్షంలో బళ్లెం పట్టుకుని నేర్చుకుంటున్నాడు పవన్. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పవన్ వింటేజ్ లుక్‌ను ప్రేక్షకులు తెగ షేర్ చేస్తున్నారు.

పవన్‌ను గతంలో చూసినట్లుగా ఉన్నాడని, ఇప్పుడు హరిహర వీరమల్లు కోసం మరోసారి వింటేజ్ లుక్స్‌తో దర్శనమివ్వడంతో ఈ సినిమాలో వీరమల్లు పాత్ర ఎలా ఉండబోతుందా అనేది ఆసక్తిగా మారింది. ఇక ఈ సినిమాను దర్శకుడు క్రిష్ చాలా జాగ్రత్తగా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫర్నాండెజ్, అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.