పానీపూరి వాలా నిర్వాకం.. తుక్కురేపిన జనం!

బయట చిరుతిళ్లు తినే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఇంట్లో తినడం ఇష్టం లేక కొందరు, తినే సమయం లేక కొందరు బయట ఆహారం తీసుకునేందుకు సిద్ధపడుతుంటారు. ఇక మెట్రో నగరాల్లో ఈ జాబితాలో చాలా మంది ఉంటారు. చిన్నాపెద్దా తేడా లేకుండా ఎక్కువ మంది ఇష్టపడి తినే పానీపూరి కోసం జనం క్యూ కడుతుంటారు. ఈమధ్య కాలంలో పానీపూరి బళ్లు కేవలం నగరాలకే కాకుండా ఊళ్లల్లో కూడా కనిపిస్తున్నాయి. అయితే ఒకచోట పానీపూరి అమ్ముతున్న వ్యక్తి చేసిన నిర్వాకం గురించి మీరు తెలుసుకుంటే, ఖచ్చితంగా పానీపూరి తినేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం ఖాయం.

కోల్హాపూర్‌లోని రంకాల లేక్ వద్ద ‘ముంబై కా స్పెషల్ పానీపూరి వాలా’ అనే ఛాట్ సెంటర్ ఉంది. స్థానికంగా ఇది బాగా పాపులర్ కావడంతో రోజూ సాయంత్రం వేళ పెద్ద సంఖ్యలో జనం ఇక్కడ పానీపూరి తినేందుకు బారులు తీరుతారు. అయితే ఇటీవల ఈ పానీపూరి నిర్వాహకుడు సమీపంలోని పబ్లిక్ టాయిలెట్ వద్ద ఉన్న నీటిని తీసుకొని పానీపూరి రసంలో కలిపాడు. ఈ తతంగాన్ని అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక ఆ వీడియో కాస్త వైరల్ కావడంతో, స్థానికులు ఆ పానీపూరి వాలా నిర్వాహకుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అంతేగాక సదరు పానీపూరి సెంటర్‌లోని వస్తువులను ధ్వంసం చేశారు.

ప్రజల ఆరోగ్యంతో ఇంకెప్పుడు ఇలా ఆడుకోవద్దంటూ పానీపూరి వాలాకు బుద్ధి వచ్చే వరకు క్లాస్ పీకారు. స్థానికంగా ఈ వార్త సంచలనం సృష్టించడంతో, ఇతర పానీపూరి వాలా సెంటర్‌ల వద్ద జనం చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఇకనైనా బయట చిరుతుళ్లు తినేవారు ఒకటికి రెండు సార్లు అవి ఎంత పరిశుభ్రంగా ఉన్నాయో చూసుకుని తినాలని పలువురు సూచిస్తున్నారు. చిరుతుళ్ల కోసం ఎగబడితే ఆరోగ్యం గంగలో కలవడం ఖాయమని మరోసారి ప్రూవ్ అయ్యింది.