రేవంత్‌తో భేటీ అయిన పాల్వాయి స్ర‌వంతి

మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గా బరిలోకి దిగుతున్న పాల్వాయి స్ర‌వంతి..ఈరోజు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆమె వెంట టికెట్ కోసం తీవ్రంగా య‌త్నించిన చ‌ల‌మ‌ల కృష్ణారెడ్డి కూడా రేవంత్ వ‌ద్ద‌కు వ‌చ్చారు. టికెట్ ఖ‌రారైన నేప‌థ్యంలో విభేదాలు వీడి పార్టీ గెలుపు కోసం క‌లిసిక‌ట్టుగా కృషి చేయాల‌ని ఈ సంద‌ర్భంగా కృష్ణారెడ్డికి రేవంత్ రెడ్డి సూచించిన‌ట్లు స‌మాచారం.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే, ఎంపీగా పనిచేసిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తెగా స్రవంతి మునుగోడు ప్రజలకు సుపరిచితురాలు. 2014 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున మునుగోడు అభ్యర్థిగా పోటీ చేసిన స్రవంతి ఆ ఎన్నిక‌ల్లో ఓటమి పాలయ్యారు. 2018 ఎన్నిక‌ల్లో కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి మునుగోడు టికెట్ ఆశించ‌డంతో స్రవంతి స్వచ్ఛందంగానే పోటీ నుంచి త‌ప్పుకుని ఆయన గెలుపు కోసం ప‌నిచేశారు. ఆ విధేయతే పాల్వాయి స్రవంతికి క‌లిసివ‌చ్చిన‌ట్లు స‌మాచారం. మునుగోడు టిక్కెట్ తనకే వస్తుందని పాల్వాయి స్రవంతి తొలి నుంచి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తన తండ్రి పార్టీకి చేసిన సేవలు, మునుగోడులో తనకున్న ప్రజాదరణను పరిగణనలోకి తీసుకుని తనకు అవకాశం ఇవ్వాలని ఆమె కోరుతూ వచ్చారు. అయితే మరోవైపు కృష్ణారెడ్డి సైతం టిక్కెట్ కోసం పైరవీలు చేయడంతో ఓ దశలో ఆమె అసహనానికి గురయ్యారు. టిక్కెట్ విషయమై ఓ కార్యకర్తతో తన ఆవేదనను వెళ్లబోసుకున్న ఆడియో కొద్దిరోజుల క్రితం వైరల్ అయింది. అయితే మెజార్టీ నేతల అభిప్రాయం మేరకు మునుగోడు ఉపఎన్నికలో పాల్వాయి స్రవంతికే అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది.