పాకిస్తాన్‌లో పెను భూకంపం..వందలమందికి గాయాలు

భారీ భూకంపంతో పాకిస్థాన్ వణికిపోయింది. పాకిస్తాన్‌ ప్రావిన్స్‌లోని హర్నోయ్‌లో గురువారం తెల్లవారుజామున 3.30 సమయంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.7గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ వెల్లడించింది. ఈ భూకంపం ధాటికి 20 మంది మరణించగా, 200 మందికి పైగా గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. మృతుల్లో మహిళలు, ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నట్లు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని బలూచిస్థాన్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ అధికారి నసీర్‌ నాసర్‌ మీడియాకు వెల్లడించారు.

భూ ప్రకంపన కారణంగా పర్వత నగరం హర్నాయిలో తీవ్ర నష్టం సంభవించింది. ఇక్కడ రోడ్డు, విద్యుత్, మొబైల్ సౌకర్యం అంతగా లేకపోవడంతో బాధితులను రక్షించడం రెస్క్యూ సిబ్బందికి ఇబ్బందిగా మారింది. రెస్క్యూ ఆపరేషన్ల కోసం ప్రత్యేకంగా హెలికాప్టర్లను పంపిస్తున్నట్టు ప్రావిన్షియల్ సీనియర్ అధికారి సుహైల్ అన్వర్ హష్మి తెలిపారు. ప్రజలంతా నిద్రలో ఉండగా భారీ భూకంపం సంభవించింది. భవనాల పైకప్పులు కూలిపడటంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.