రాఫెల్ చేరిక‌ యావ‌త్ ప్ర‌పంచానికి అతి పెద్ద‌, క‌ఠిన సందేశం

rajnath-singh

అంబాలా: భారత్‌ వైమానికి దళంలోకి ఈరోజు ఐదు రఫెల్‌ యుద్ధ విమానాలు చేరాయి. ఈ సంద‌ర్భంగా ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. రాఫేల్ రాక‌తో భార‌త్‌, ఫ్రాన్స్ మ‌ధ్య బంధం బ‌లోపేత‌మైంద‌న్నారు. రెండు దేశాల మ‌ధ్య వ్యూహాత్మ‌క సంబంధాలు కూడా బ‌ల‌ప‌డ్డాయ‌న్నారు. రాఫేల్ కోసం ఎన్నో అవాంత‌రాలు ఏర్ప‌డ్డాయ‌ని, కానీ ప్ర‌ధాని మోడి బ‌ల‌మైన కాంక్ష వ‌ల్ల ఇది సాధ్య‌మైందన్నారు. స్వేచ్ఛ, స‌మాన‌త్వం, సోద‌ర‌భావం, వ‌సుదైక కుటుంబం అన్న సూత్రాల‌కు రెండు దేశాలు క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లు ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ తెలిపారు. ఈ సూత్రాల‌నే రెండు దేశాలు ప్ర‌పంచ‌వ్యాప్తం చేస్తున్నాయ‌న్నారు. భార‌త స్వాతంత్ర్యం త‌ర్వాత రెండు దేశాల మ‌ధ్య సంబంధాలు మ‌రింత మెరుగుప‌డిన‌ట్లు చెప్పారు. రాఫేల్ ఇండ‌క్ష‌న్ కార్య‌క్ర‌మంలో ఫ్రాన్స్ ర‌క్ష‌ణ మంత్రి ఫ్లోరెన్స్ పాల్గొన‌డం రెండు దేశాల మ‌ధ్య బ‌ల‌మైన ర‌క్ష‌ణ భాగ‌స్వామ్యాన్ని గుర్తు చేస్తోంద‌న్నారు. ప్ర‌పంచ శాంతి కాంక్ష‌తోనే తాము త‌మ ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేస్తున్న‌ట్లు రాజ్‌నాథ్ తెలిపారు. శాంతియుత వాతావ‌ర‌ణాన్ని దెబ్బ‌తీసే విధంగా తాము ఎప్పుడూ ప్ర‌వ‌ర్తించ‌బోమ‌న్నారు.

భార‌త వాయుసేన‌లోకి రాఫెల్ చేరిక‌ యావ‌త్ ప్ర‌పంచానికి అతి పెద్ద‌, క‌ఠిన సందేశాన్ని ఇస్తుంద‌ని రాజ్‌నాథ్ తెలిపారు. మ‌న సార్వ‌భౌమ‌త్వంపై క‌న్నువేసిన వారికి ఈ యుద్ధ‌విమానాలు వ‌ణుకు పుట్టిస్తాయ‌న్నారు. ప్ర‌స్తుతం స‌రిహ‌ద్దుల్లో ఉన్న వాతావ‌ర‌ణాన్ని దృష్టిలో పెట్టుకుంటే, ఈ ఇండ‌క్ష‌న్ ఎంతో కీల‌క‌మైంద‌న్నారు. ఇటీవ‌ల తాను విదేశీ టూర్‌కు వెళ్లాన‌ని, అక్క‌డ భార‌త్ అభిప్రాయాన్ని సుస్ప‌ష్టం చేసిన‌ట్లు రాజ్‌నాథ్ తెలిపారు. ఎటువంటి ప‌రిస్థితుల్లో త‌మ భూభాగాన్ని వ‌దులుకునేది లేద‌ని తేల్చిచెప్పిన‌ట్లు గుర్తు చేశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/