దుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్‌ దంపతులు

దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు విజయవాడ ఇంద్రకీలాద్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ దంపతులు గురువారం అమ్మవారిని దర్శించుకున్నారు. గవర్నర్‌ దంపతులకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఆలయ పాలక మండలి ఛైర్మన్‌ పైలా సోమినాయుడు, ఈవో భ్రమరాంబ స్వాగతం పలికారు.

దర్శనం అనంతరం గవర్నర్‌ మీడియాతో మాట్లాడుతూ, దసరా మొదటి రోజున దుర్గమ్మను దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలని, కరోనాను ప్రపంచం నుంచి దూరం చేయాలని అమ్మవారిని కోరుకున్నానని గవర్నర్‌ తెలిపారు. ఇక ఉత్సవాలలో ముఖ్యమైనదిగా భావించే మూలా నక్షత్రమైన ఈ నెల 12న కనకదుర్గ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పట్టు వ్రస్తాలు సమర్పిస్తారని ఆలయ అధికారులు వెల్లడించారు. దసరా ఉత్సవాల ప్రారంభానికి ముందురోజున వన్‌టౌన్‌ పోలీసులు అమ్మవారికి పట్టు వ్రస్తాలు సమర్పించడం ఆనవాయితీ ..తర్వాత రోజుల్లో నగర పోలీసు కమిషనర్‌ సమర్పించేవారు. ఈ నేపథ్యంలో నగర పోలీసు కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు కుటుంబసమేతంగా బుధవారం రాత్రి ఇంద్రకీలాద్రికి వచ్చి అమ్మవారికి పట్టువ్రస్తాలు సమర్పించారు.

ఇక కరోనా కారణంగా అంతరాలయ దర్శనాలను రద్దుచేసి లఘు దర్శనం ఏర్పాటు చేశారు. కరోనా నిబంధనలు పాటిస్తూ అన్నదానాన్ని నిలుపుదల చేశారు. దానికి బదులుగా ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకు బెల్లం పొంగలి, 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సాంబార్‌ రైస్, పెరుగు అన్నం ప్యాకెట్లు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బెల్లం పొంగలి భక్తులకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.