ఒమిక్రాన్‌ వేరియంట్ లక్షణాలు ఎలా ఉంటాయంటే..తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే..?

ఒమిక్రాన్‌ వేరియంట్ లక్షణాలు ఎలా ఉంటాయంటే..తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే..?

కరోనా మహమ్మారి ఉదృతి తగ్గిందని అనుకునే లోపే మరో కొత్త వేరియంట్ బయటకొచ్చింది. ఒమిక్రాన్‌ అనే వేరియంట్ ఇప్పుడు ప్రపంచ దేశాలను హడలెత్తిస్తోంది. అసలు ఒమిక్రాన్‌ అంటే ఏంటి.. దీనికి ఎవరు ఆ పేరు పేరు పెట్టారు..దీని లక్షణాలు ఏంటి..వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఇప్పుడు ప్రజలంతా మాట్లాడుకుంటున్నారు.

కరోనా వేరియంట్‌లో కొత్త వేరియంట్ ఒమిక్రాన్. ఈ పేరును ఫైలోజెనిటిక్ అసైన్‌మెంట్ ఆఫ్ నేమ్డ్ గ్లోబల్ ఔట్‌బ్రేక్ సంస్థ నిర్ణయించింది. ఒమిక్రాన్‌తో ఎంతమేరకు రిస్క్ ఉందనే విషయం పై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. అంటే వ్యాక్సిన్ తీసుకున్న వారిలో, వ్యాక్సిన్ తీసుకోనివారిలో ఈ పరిశోధనలు చేస్తున్నారు. అయితే వ్యాక్సిన్ తీసుకున్నవారికి కూడా ఒమిక్రాన్ సోకుతుందన్న విషయం మరవరాదని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి కచ్చితంగా కోవిడ్ నిబంధనలను పాటించాలని అలసత్వం ప్రదర్శించరాదని శాస్త్రవేత్తలు పదేపదే చెబుతున్నారు.

ఒమిక్రాన్‌ లక్షణాలు ఎలా ఉంటాయంటే.. ఒమిక్రాన్‌ వైరస్ ఉన్నవారిలో తీవ్రమైన అలసట ఉంటుంది. యువకులు కూడా బాగా అలసి పోవడం లాంటి లక్షణాలు మనం చూడొచ్చు. అలానే ఆక్సిజన్ శాచ్యురేషన్ లెవెల్స్ ఇందులో డ్రాప్ అవ్వట్లేదు. మనం కరోనా సెకండ్ వేవ్ లో ఉన్నప్పుడు చాలా మందిలో ఆక్సిజన్ లెవెల్స్ డ్రాప్ అయ్యాయి. కానీ ఈ వేరియంట్ లో అలా ఉండదు. ఒమిక్రాన్‌ వైరస్ బారిన పడిన వారిలో రుచి తెలియటం కానీ వాసన కానీ తెలియకపోవడం ఉంటుంది. అలానే ఈ వైరస్ బారిన పడ్డ వాళ్లలో చాలా మంది ఆస్పత్రిలో చేరకుండానే కోలుకోవచ్చని డాక్టర్స్ చెపుతున్నారు.

ఇక గత రెండేళ్లలో వైరస్ పట్ల మన దేశంలో చాలావరకు అవగాహన వచ్చింది. ఇక కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలి. అంటే మాస్కులు ధరించడం, చేతులను శుభ్రపరుచుకోవడం, వ్యాక్సినేషన్ చేయించుకోవడం, జనసమర్దత ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండటం, భౌతిక దూరం పాటించడం, వెంటిలేషన్ ఉండే గదుల్లో ఉండటం వంటివి పాటించాలని వైద్యులు చెబుతున్నారు. అయితే రోజువారీ కేసుల సంఖ్య భారత్‌లో తగ్గుతోంది. అదే సమయంలో ఇప్పటి వరకు ఒమిక్రాన్ కేసులు భారత్‌లో గుర్తించలేదు. రాష్ట్రప్రభుత్వాలు ముందుగానే ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు జాగ్రత్తలతో సిద్ధంగా ఉండాలని చెబుతున్నారు. జన్యుపరమైన పరీక్షలు వేగవంతంగా నిర్వహించాల్సి ఉంటుందని చెప్పారు.