కరోనా ఎఫెక్ట్: ఒకే రోజు 97 మంది మృతి

908కి చేరిన కరోనా మృతుల సంఖ్య

Coronavirus death toll rises to 908
Coronavirus death toll rises to 908

బీజింగ్: చైనాలో వ్యాప్తి చెందినా కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తుంది. ఇప్పటికే 26 దేశాలకు విస్తరించిన కరోనా వైరస్, 2002 – 03లో వణికించిన సార్స్ వైరస్ రికార్డును అధిగమించింది. దాదాపు 18 సంవత్సరాల క్రితం వచ్చిన సార్స్ 774 మందిని బలితీసుకోగా (అధికారిక లెక్కలు), ఇప్పుడు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 900 దాటింది. ఆదివారం ఒక్క రోజే ౯౭ మంది మృతి చెందినట్లు తెలిసింది. అయితే కరోనా మృతులు వేల సంఖ్యలోనే ఉన్నారన్న అనుమానాలు ఉన్నా, చైనా ప్రభుత్వం చెబుతున్న గణాంకాలు మాత్రం ఇవే. నేడు కరోనా ఎలాగైతే చైనాలో వెలుగులోకి వచ్చిందో, నాడు సార్స్ కూడా చైనాలోనే తొలిసారి బయటకు వచ్చింది. ఈ రెండు వైరస్ లూ ఒకే క్రిమి కుటుంబానికి చెందినవి కావడం గమనార్హం. ఈ రెండింటినీ జీవాయుధాలుగా చైనాయే స్వయంగా అభివృద్ధి చేసిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఇక ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం, చైనాలో 40 వేల మంది వరకూ కరోనా సోకి బాధపడుతున్నారు. అందులో 6,188 మంది పరిస్థితి విషమంగా ఉంది. కొత్తగా 3 వేల మంది వరకూ అనుమానితులు ఆసుపత్రుల్లో చేరారు. చైనాకు వెలుపల ఫిలిప్పీన్స్ లో ఒకరు, హాంకాంగ్ లో ఒకరు మరణించారు. ఇండియాలో మూడు కేసులు నమోదయ్యాయి. వీరు ముగ్గురూ చైనాలోని వూహాన్ నుంచి వచ్చిన వారు కావడం గమనార్హం. ఇదిలావుండగా, వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు చైనా ఇప్పటికే 1200 కోట్ల డాలర్లను విడుదల చేసింది. రికార్డు సృష్టిస్తూ, 10 రోజుల్లో 1000 పడకల ఆసుపత్రిని నిర్మించింది. కరోనాకు అడ్డుకట్ట వేసే విషయంలో తమవంతు సహకారాన్ని అందిస్తామని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కు ఫోన్ లో చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/