ఏపీలో గురువారం భారీ ఎత్తున థియేటర్స్ సీజ్

Cinema hall

ఏపీలో థియేటర్ల తనికీలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలను పాటించని థియేటర్ల ఫై అధికారులు కొరడా జుళిపిస్తున్నారు. గురువారం కూడా అధికారులు పలు జిల్లాలో థియేటర్ల తనిఖీలు చేపట్టారు. చిత్తూరు జిల్లా కుప్పంలో లైసెన్స్ లు లేని నాలుగు సినిమా హాళ్లను మూసివేశారు. మదనపల్లెలో లైసెన్స్ రెన్యువల్ చేసుకోని థియేటర్లపై అధికారులు చర్యలు తీసుకున్నారు. 7థియేటర్లలోని సినిమాలు నిలిపివేస్తున్నట్లు సబ్ కలెక్టర్ ప్రకటించారు. లైసెన్స్ రెన్యువల్ చేసుకున్నాకే థియేటర్లు ప్రారంభించుకోవాలని ఆదేశాలు జారీచేశారు.

గుంటూరులోని థియేటర్లలో జేసీ దినేశ్‌ కుమార్ తనిఖీ నిర్వహించారు. హాలీవుడ్, బాలీవుడ్, లక్ష్మీ పిక్చర్ ప్యాలెస్‌లో సోదాలు చేశారు. థియేటర్లలో వసతులను పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనలు అమలు చేయాలని యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు. అనంతపురంలో ప్రభుత్వ నిబంధనల మేరకు తినుబండారాలు, టిక్కెట్ విక్రయాలు చేపట్టాలని యజమానులకు సూచించారు. సక్రమంగా రికార్డులు నిర్వహించాలని యాజమాన్యాలను ఆదేశించారు.

తూర్పుగోదావరి జిల్లాలో పలు చోట్ల సినిమా థియేటర్లను స్వచ్ఛందంగా మూసి వేశారు. మండల కేంద్రాలు, పంచాయతీ పరిధిలోని హాళ్లలో ఇవాళ చిత్రాల ప్రదర్శన ఆపేశారు. సినిమా హాళ్లలో ప్రభుత్వం నిర్దేశించిన ధరలు తమకు ఏ మాత్రం గిట్టుబాటు కాదంటూ.. యాజమాన్యాలు హాళ్లను స్వచ్ఛందంగా మూసివేశారు. మరోపక్క సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపట్ల చిత్రసీమ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా లో కామెంట్స్ పెడుతున్నారు.