మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితి

ఎన్‌ఎస్‌యూఐ నేతలు మంత్రి ఇంటిని ముట్టడించేందుకు పిలుపు

sabitha indra reddy

హైదరాబాద్ః రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనుమతి లేని ప్రైవేట్ యూనివర్సిటీలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో ఎన్‌ఎస్‌యూఐ నేతలు ఆమె ఇంటిని ముట్టడించేందుకు పిలుపునిచ్చారు. దీంతో మంత్రి ఇంటి దగ్గర భారీగా పోలీసుల మోహరించారు. శ్రీనిధి, గురునానక్‌ కళాశాలలు విద్యార్థులను మోసం చేస్తున్నాయని ఎన్‌ఎస్‌యూఐ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ గుర్తింపు లేకున్నా పెద్ద మొత్తంలో ఫీజు వసూలు చేస్తున్నాయని గుర్తు చేశారు. అలాగే అనుమతులు లేని ఆయా యూనివర్శిటీల్లో విద్యార్ధులకు సెమిస్టర్ పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ఎన్‌ఎస్‌యూఐ నేతలు ప్రశ్నించారు. అనుమతి లేని ప్రైవేటు యూనివర్సిటీలు విద్యార్థులను మోసం చేస్తున్నాయని, వీటిని వెంటనే రద్దు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. అయితే సబిత ఇంటి ముట్టడికి వచ్చిన ఎన్ఎస్‌యూఐ నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు. మంత్రిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తే ఎందుకు కలవనివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆందోళనకారులు. ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ సహా పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

కాగా, గత కొన్ని రోజులుగా అనుమతి లేని ప్రైవేటు విశ్వవిద్యాలయాలను రద్దు చేయాలంటూ వరుసగా ఆందోళనలు చేస్తున్నారు బల్మూరి వెంకట్‌. 2018లో అయిదు ప్రైవేటు వర్సిటీలకు ప్రభుత్వం అనుమతిచ్చిందని..2021లో మళ్లీ ఆరింటిని చేర్చుతూ అసెంబ్లీలో బిల్లు పాస్‌ చేసిందన్నారు. ఆ బిల్లు గవర్నర్‌ ఆమోదం పొందిన తర్వాతే వాటికి అనుమతి ఇవ్వాలని.. నిబంధనలకు విరుద్ధంగా కేవలం ప్రభుత్వ అనుమతితో నడిపిస్తూ విద్యార్థులను మోసం చేస్తున్నారని బల్మూరి ఆరోపిస్తున్నారు.