సుప్రీం పాలకుడి కంట కన్నీరు..!

మరింత మంది పిల్లలను కనాలంటూ తల్లులకు సూచన

north-korea-president-kim-jong-un-spotted-crying-in-viral-video

ప్యాంగ్యాంగ్‌ః కర్కశత్వానికి, నిర్దయకు బ్రాండ్ అంబాసిడర్ లాంటి వ్యక్తి నిండు సభలో కన్నీరు పెట్టారు.. దేశంలో జననాల రేటు తగ్గుతోందని ఆవేదన చెందారు. మరింత మంది పిల్లలను కనాలంటూ తల్లులకు విజ్ఞప్తి చేశారు. ఆయనే ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జాంగ్ ఉన్.. ఇటీవల ప్యాంగ్యాంగ్ లో జరిగిన ఓ సభలో ఈ ఘటన చోటుచేసుకుంది. దేశంలోని తల్లులతో ప్యాంగ్యాంగ్ లో కిమ్ ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా జననాల రేటు పడిపోవడంపై ఈ సభలో వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు.

కీలకమైన నేత ఒకరు మాట్లాడుతుండగా కిమ్ కన్నీరుకార్చారు. టిష్యూ పేపర్ తో ఆయన కళ్లు తుడుచుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిన్న చిన్న తప్పులకే మరణశిక్ష విధించడం, జనాలను బాధపెట్టడం తప్ప తను బాధపడడం ఎన్నడూ చూడలేదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. తమ సుప్రీం పాలకుడి కంట కన్నీరు చూసి ఈ సభకు హాజరైన మహిళలు కూడా భావోద్వేగానికి లోనయ్యారు. పలువురు నిశ్శబ్దంగా ఏడుస్తుండడం వీడియోలో కనిపిస్తోంది.

కరోనా సంక్షోభంతో ఉత్తర కొరియా మరింత గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. ఇరుగు పొరుగు దేశాలతో వర్తకవాణిజ్యాలు తగ్గిపోయాయి. దేశ జనాభాలో చాలా మందికి కనీస అవసరాలు తీర్చుకునే వెసులుబాటు కూడా లేకుండా పోయినట్లు సమాచారం. ఓవైపు కుటుంబంలో ఇప్పుడున్న వారికే కడుపునిండా తిండి దొరకడంలేక అల్లాడుతుంటే మరింతమందిని కనాలంటూ కిమ్ పిలుపునివ్వడంతో నెటిజన్లు విస్తుపోతున్నారు.