దేశం పేరు మార్పు.. స్పందించిన ఎన్సీపీ అధినేత

దేశం పేరును మార్చే హక్కు ఎవరికీ లేదు.. శరద్ పవార్

No One Has Right To Change Country’s Name: Sharad Pawar On ‘Bharat’ Invite

ముంబయిః జీ-20 విందు కోసం రాష్ట్రపతి భవన్ పంపిన ఆహ్వాన పత్రికల్లో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఉండటం, కేంద్ర ప్రభుత్వం త్వరలో ఇండియా పేరును భారత్‌గా మార్చనుందనే ఊహాగానాలపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు. దేశం పేరును మార్చే హక్కు ఎవరికీ లేదన్నారు. మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ… దేశానికి సంబంధించిన పేరుపై అధికార పార్టీ ఎందుకు కలవరపడుతోందో తనకు అర్థం కావడం లేదన్నారు. అయితే ఇండియాను భారత్‌గా మారుస్తారా? అనే విషయమై తనకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. ‘ఇండియా’ కూటమిలోని పార్టీల అధినేతలతో కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే బుధవారం నిర్వహిస్తున్న సమావేశంలో దీనిపై చర్చిస్తామని శరద్ పవార్ చెప్పారు.

శరద్ పవార్ అంతకుముందు మరాఠా రిజర్వేషన్ల అంశంపై కూడా మాట్లాడారు. రిజర్వేషన్లలో తమకు ప్రత్యేక కోటా కేటాయించాలని మరాఠాలు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో పవార్ మాట్లాడుతూ… ఇప్పటి వరకు ఉన్న 50 శాతం కోటా పరిమితిని ఎత్తివేయాలన్నారు. ఇతర వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్లను సమకూర్చాలంటే ఇప్పుడున్న దానికి అదనంగా 15 నుండి 16 శాతం పెంచాలన్నారు. మరాఠా కోటాపై జరుగుతోన్న ఆందోళనలు ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో పవార్ ఈవ్యాఖ్యలు చేశారు.