మన జాతులు పల్లకీలు మోయడానికే ఉన్నాయా?

కాపు, బీసీ, దళితులకు ముద్రగడ పద్మనాభం లేఖ

అమరావతి: కాపు, దళిత, బీసీ సామాజికవర్గాలను ఉద్దేశించి కాపు నేత ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందే కానీ, మన జాతులకు మాత్రం రాలేదని లేఖలో ఆయన పేర్కొన్నారు. తక్కువ జనాభా ఉన్న జాతులు మాత్రమే అధికారాన్ని అనుభవిస్తున్నాయని… ఎక్కువ జనాభా ఉన్న మనం అధికారాన్ని ఎందుకు అనుభవించకూడదని ఆయన ప్రశ్నించారు. అధికారం ఇవ్వాలని అడిగితే ఇవ్వరని… అధికారాన్ని గుంజుకోవాలని అన్నారు.

మన జాతులు పల్లకీలు మోయడానికే ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఎంత కాలం పల్లకీలు మోయాలో ఆలోచించాల్సిన సమయం వచ్చిందని అన్నారు. పల్లకీలు మోయించుకుంటున్నవారు మన అవసరం తీరాక.. పశువుల కన్నా హీనంగా మనల్ని చూస్తున్నారని విమర్శించారు. మనం ఎప్పటికీ పల్లకీలో కూర్చోలేమా? అనే విషయం గురించి అందరూ ఆలోచించాలని చెప్పారు. మన జాతులను బజారులో కొనుగోలు చేసే వస్తువులుగా పల్లకీలో కూర్చునేవారు భావిస్తున్నారని అన్నారు. వారు చాలా ధనవంతులు, మన జాతులు గడ్డి పరకలు అనే భావన వారిదని విమర్శించారు. గడ్డి పరకకు విలువ ఉండదని… అయితే దాన్ని మెలివేస్తే ఏనుగును కూడా బంధిస్తుందని చెప్పారు.

ఇతర బీసీ, దళిత నాయకుల సహకారం తీసుకుని బ్లూ ప్రింట్ తయారు చేద్దామని ముద్రగడ పిలుపునిచ్చారు. ఎలాంటి ఆర్భాటాలు, హడావుడి లేకుండా… చాపకింద నీరులా, భూమిలోపల వైరింగులా మన కార్యాచరణ ఉండాలని చెప్పారు. మనం ఎవరికీ వ్యతిరేకం కాదని అన్నారు. ఈ రాష్ట్రం ఎవరి ఎస్టేటు, జాగీరు కాదని అన్నారు. వారు ఎన్నేళ్లు అధికారం అనుభవించారో మనం కూడా అన్నేళ్లు అనుభవించాలని… దీన్ని సాధించేందుకు మన జాతుల పెద్దలందరం తరచుగా మాట్లాడుకుని మంచి ఆలోచన చేద్దామని కోరారు. మరోవైపు ముద్రగడ కొత్త రాజకీయ పార్టీని పెట్టబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన బహిరంగ లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది. కొత్త పార్టీపై త్వరలోనే ముద్రగడ నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉందనే చర్చ జరుతుతోంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/