చైనాలో మరో కొత్త బ్యాక్టీరియా
6,000 మందికి సోకిన ‘బ్రూసెల్లోసిస్’

బీజింగ్: ప్రపచదేశాలకు కరోనా వైరస్‌ను అంటించిన చైనాలో ఇప్పుడు మరో కొత్త రకం బ్యాక్టీరియా వెలుగుచూసింది. దీనిని బ్రూసెల్లోసిస్ అని తేల్చారు. గన్సు ప్రావిన్స్ రాజధాని లాన్‌ఝౌలో 6,000 మందికిపైగా ఈ బ్యాక్టీరియా బారినపడినట్టు స్థానిక ప్రభుత్వం ప్రకటించింది. ఏడాది క్రితం చైనా పశుసంవర్థకశాఖకు చెందిన బయోఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీ నుంచి లీకేజీ కారణంగా ఈ బ్యాక్టీరియా బయటకు వచ్చినట్టు పేర్కొంది. నగరంలో మొత్తం 55,725 మందిని పరీక్షించగా, వారిలో 6,620 మందికి బ్రూసెల్లోసిస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని వివరించింది. బ్యాక్టీరియా సోకిన జంతువులతో ప్రత్యక్ష సంబంధాల వల్ల, కలుషితమైన జంతు ఉత్పత్తులను తినడం, తాగడం వల్ల ఈ బ్యాక్టీరియా సోకుతుందని లాన్‌ఝౌ హెల్త్ కమిషన్ పేర్కొంది. కాగా, ఈ ఏడాది సెప్టెంబరులో 3,245 మంది ఈ బ్యాక్టీరియా బారినపడ్డారు. ఈ బ్యాక్టీరియా సోకిన వారిలో ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తాయి.
తాజా కెరీర్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/specials/career/