అయోధ్య రామయ్యకు అత్తారింటి నుంచి వెండివిల్లు..3 వేలకుపైగా కానుకలు

సీతాదేవి జన్మించిన నేపాల్‌లోని జనక్‌పూర్ నుంచి 30 వాహనాల్లో వచ్చిన భక్తులు

more-than-3000-gifts-including-silver-bow-to-lord-sri-ram-from-in-laws-place

న్యూఢిల్లీః అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి శరవేగంగా పనులు జరుగుతున్న వేళ రామయ్యకు అత్తారింటి నుంచి కానుకలు వెల్లువెత్తుతున్నాయి. సీతాదేవి జన్మించిన నేపాల్‌లోని జనక్‌పూర్ నుంచి 3 వేలకు పైగా బహుమానాలు అయోధ్యకు చేరుకున్నాయి. వీటిలో వెండి పాదరక్షలు, ఆభరణాలు, దుస్తులు, వెండివిల్లు వంటివి ఉన్నాయి.

జనక్‌పూర్‌లోని రామ్‌జానకి ఆలయ పూజారి రామ్ రోషన్‌దాస్ వీటిని శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు అందించారు. 800 మంది భక్తులు 500 డబ్బాల్లో 30 వాహనాల్లో కాన్వాయ్‌గా ఈ బహుమతులను తీసుకొచ్చారు. వీటిలో పండ్లు, స్వీట్లు, బంగారు, వెండి వస్తువులు, డ్రైఫ్రూట్స్, నేపాల్ సంప్రదాయ మిఠాయిలు వంటివి ఉన్నాయి.

కాగా, 500 ఏళ్ల నాటి ఈ వివాదం చాలా కాలం తర్వాత సద్దుమణిగిందని జనక్ పుర్ ఆలయ పూజారి రోషన్ దాస్ అన్నారు. జనవరి 22న ప్రాణ ప్రతిష్ట జరగుతున్నందుకు తాము ఎంతో సంతోషిస్తున్నామని చెప్పారు. ఈ బంధం త్రేతాయుగానికి చెందినదని.. అప్పుడు రాముడికి, సీతమ్మకు స్వయంవర వివాహం జరిగిందని గుర్తు చేశారు. ఆ బంధం ఉంది కాబట్టే మేము ఇప్పుడు రాముడు ఇంటి ఏర్పాటుకు అవసరమైన వస్తువులను తీసుకొచ్చామని ఆయన వెల్లడించారు.

మరోవైపు అయోధ్య రామయ్య ఆలయ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి రంగం సిద్ధమవుతోంది. జనవరి 22వ తేదీ రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన అంగరంగ వైభవంగా జరగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మహత్తర కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఓవైపు ప్రముఖులు మరోవైపు సామాన్య ప్రజలు అయోధ్యకు తరలిరానున్నారు.