మ‌ణిపూర్ అంశం‌..లోక్‌స‌భ 2 గంట‌ల‌కు వాయిదా

Monsoon Session Rajya Sabha Adjourned Till 12 pm, Lok Sabha Till 2 pm

న్యూఢిల్లీ: పార్ల‌మెంట్‌లో ఈరోజు కూడా మ‌ళ్లీ మ‌ణిపూర్ అంశ‌మే ద‌ద్ద‌రిల్లింది. లోక్‌స‌భ‌లో విప‌క్షాలు ఈరోజు ఉద‌యం ప్ర‌శ్నోత్త‌రాల‌ను అడ్డుకున్నాయి. మ‌ణిపూర్‌లో జ‌రుగుతున్న హింసాకాండ గురించి చ‌ర్చించాల‌ని డిమాండ్ చేశాయి. కానీ స్పీక‌ర్ ఓం బిర్లా ఆ వాయిదా తీర్మానాల‌ను కొట్టిపారేశారు. ప్ర‌శ్నోత్త‌రాల‌ను నిర్వ‌హించేందుకు ఆయ‌న సుముఖ‌త వ్య‌క్తం చేశారు. అయితే ప్ర‌శ్నోత్త‌రాల‌ను విప‌క్ష స‌భ్యుల త‌మ నినాదాల‌తో అడ్డుకున్నారు. ఆందోళ‌న‌ల‌తో స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావ‌ని స్పీక‌ర్ బిర్లా అన్నారు. స‌భ హుందాత‌నాన్ని కాపాడాల‌ని ఆయ‌న స‌భ్యుల్ని కోరారు. కానీ విప‌క్ష స‌భ్యులు నినాదాల‌ను వెన‌క్కి త‌గ్గించ‌లేదు. ప్ర‌శ్నోత్త‌రాల‌ను అడ్డుకోవ‌డంతో ఆయ‌న స‌భ‌ను మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల వ‌ర‌కు వాయిదా వేశారు. మ‌ణిపూర్ అంశంపై చ‌ర్చ చేప‌ట్టాల‌ని నేడు బిఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఎంపీ నామా నాగేశ్వ‌ర్‌రావు వాయిదా తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. మ‌ణిపూర్‌లో శాంతి నెల‌కొల్ప‌డంతో పాటు సాధార‌ణ ప‌రిస్థితులు ఏర్ప‌డేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బిఆర్ఎస్ పార్టీ కోరింది. మ‌ణిపూర్ ఘ‌ట‌న‌ల‌పై ప్ర‌ధాని మోడీ స‌మాధానం చెప్పాల‌ని బిఆర్ఎస్ డిమాండ్ చేసింది.