ఇరాన్‌ తాత్యాలిక అధ్యక్షుడిగా ముఖ్బీర్‌..?

Mohammad Mokhber, man set to become Iran President after Raisi’s death?

టెహ్రాన్‌ః ఇరాన్ అధ్యక్షుడు అయతుల్లా సయ్యద్ ఇబ్రహీం రైసీ అల్- సదటి కన్నుమూశారు. హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఇబ్రహీ రైసీతో పాటు మరో తొమ్మిది మంది ఈ దుర్ఘటనలో దుర్మరణం పాలయ్యారు. వారిలో ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి కూడా ఉన్నారు.

వాళ్లు ప్రయాణిస్తోన్న బెల్ 212 రకానికి చెందిన హెలికాప్టర్ పెను ప్రమాదానికి గురైంది. ఇరాన్- అజర్‌బైజాన్ సరిహద్దుల్లో కొత్తగా నిర్మించిన ఓ డ్యామ్ ప్రారంభోత్సంలో పాల్గొని తిరిగి వచ్చే సమయంలో ఈ దుర్ఘటన సంభవించింది. అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్‌తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇబ్రహీం రైసీ. డ్యామ్ ప్రారంభోత్సవం ముగిసిన తరువాత హెలికాప్టర్‌లో రాజధాని టెహ్రాన్‌కు తిరుగుముఖం పట్టారు.

ఈస్ట్ అజర్‌బైజాన్ ప్రావిన్స్‌లోని వర్జాఖాన్- జోల్ఫా మధ్య విస్తరించి ఉన్న దట్టమైన డిజ్మర్ అడవుల మీదుగా హెలికాప్టర్ ప్రయాణిస్తోన్న సమయంలో అది కుప్పకూలింది. దట్టమైన పొగమంచు, ప్రతికూల వాతావరణం వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు ఇరాన్ హోం మంత్రి అహ్మద్ వహీదీ తెలిపారు.

ఇబ్రహీ రైసీతో పాటు విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ హొస్సైన్ అమిరబ్దుల్లాహియాన్, అయతొల్లా సయ్యద్ ముహమ్మద్ అలీ అల్-హషెమ్, డాక్టర్ మాలిక్ రహ్మతి, సర్దార్ సయ్యద్ మెహదీ మౌసవి, అన్ అనసర్ అల్-మెహదీ కార్ప్స్, పైలెట్, కో పైలెట్, కృఛేవ్ అనే వ్యక్తి మరణించారు.

ఇబ్రహీం రైసీ స్థానంలో ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా ముహమ్మద్ ముఖ్బార్ నియమితులు కానున్నారు. ప్రస్తుతం ఆయన ఉపాధ్యక్షుడి హోదాలో ఉన్నారు. ఆయన నియామకానికి సంబంధించిన ప్రక్రియ మొత్తం పూర్తయింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖొమేనీ ఆమోదం తెలపాల్సి ఉంటుంది.

అలాగే- ఇరాన్ రాజ్యాంగం ప్రకారం.. ఎవరైనా ఆ దేశ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరిస్తే 50 రోజుల్లోపల ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల్లో గెలిచిన తరువాతే తాత్కాలిక అధ్యక్షుడికి పూర్తి బాధ్యతలు లభిస్తాయి. లేదా- ఆ ఎన్నికల్లో గెలిచిన పార్టీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.