మ‌ణిపూర్ మండుతుంటే..అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని మోడీ యోగాస‌నాలుః దిగ్విజ‌య్ సింగ్

Modi on ‘global darshan’ while Manipur is burning

న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియ‌ర్‌ నేత దిగ్విజ‌య్ సింగ్, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అమెరికా ప‌ర్య‌ట‌న‌పై మండిప‌డ్డారు. అల్ల‌ర్ల‌తో అట్టుడుకుతూ మ‌ణిపూర్ మండుతుంటే ప్ర‌ధాని అమెరికా యోగాస‌నాలు వేస్తున్నార‌ని ఆయన విమర్శించారు. పాక్‌కు చెందిన ల‌ష్కరే ఉగ్ర‌వాది, 2008 ముంబయి దాడుల నిందితుడు సాజిద్ మిర్‌ను గ్లోబ‌ల్ టెర్ర‌రిస్ట్‌గా ప్ర‌క‌టించే ప్ర‌తిపాద‌న‌ను చైనా మోకాల‌డ్డుతుంటే ప్ర‌ధాని మోడీ విదేశీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా గ‌డుపుతున్నార‌ని ఎద్దేవా చేశారు.

రోమ్ త‌గ‌ల‌బ‌డుతుంటే నీరో ఫిడేల్ వాయించిన ఘ‌ట‌న‌ను ఇది గుర్తుకు తెప్పిస్తోంద‌ని ట్విట్ట‌ర్ వేదిక‌గా దిగ్విజ‌య్ సింగ్ మోడీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. మ‌ణిపూర్ అల్ల‌ర్ల‌లో ఇప్ప‌టివ‌ర‌కూ 100 మందికి పైగా మ‌ర‌ణించార‌ని, ఇప్ప‌టికీ రాష్ట్రంలో ఉద్రిక్త‌త‌లు కొన‌సాగుతుండ‌గా ప్ర‌ధాని మోడీ దాల్చార‌ని, మ‌ణిపూర్ భ‌గ్గుమంటుంటే అమెరికా ప‌ర్య‌ట‌నకు వెళ్లార‌ని కాంగ్రెస్ ఆక్షేపించింది. గ‌త తొమ్మిదేండ్లుగా ప్ర‌ధాని ప‌నితీరు పేల‌వంగా ఉంద‌ని, అందుకే మోడీ త‌నను మార్కెటింగ్ చేసుకుంటున్నార‌ని ఎద్దేవా చేశారు. అద్వానీ చెప్పిన‌ట్టు మోడీ గొప్ప ఈవెంట్ మేనేజ‌ర్ అని దిగ్విజ‌య్ వ్యాఖ్యానించారు.

గ‌త తొమ్మిదేండ్ల‌లో త‌న‌ను తాను గొప్ప‌గా ప్ర‌మోట్ చేసుకోవ‌డం మిన‌హా అన్ని రంగాల్లో ఆయ‌న విఫ‌ల‌మ‌య్యార‌ని అన్నారు. మ‌ణిపూర్ మండుతుంటే ప్ర‌పంచ ద‌ర్శ‌నానికి బ‌య‌లుదేరిన ప్ర‌ధాని గురించి ఏం చెబుతామ‌ని మ‌రో ట్వీట్‌లో దిగ్విజ‌య్ సింగ్ ప్ర‌శ్నించారు. కాగా అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీ బుధ‌వారం న్యూయార్క్‌లోని ఐక్య‌రాజ్య‌స‌మితి ప్రధాన కార్యాల‌యంలో యోగా వేడుక‌ల్లో పాల్గొన్నారు.