ఎర్రకోటపై మువ్వన్నెల జెండా ఆవిష్కరించిన ప్రధాని మోడీ

దేశవ్యాప్తంగా 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎర్రకోటపై ప్రధాని మోడీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. 75 వసంతాల స్వాతంత్రాన్ని పూర్తి చేసుకుని 76వ వడిలోకి అడుగుపెట్టింది భారత్‌. దేశం మొత్తం గత నాలుగైదు రోజులుగా సందడి వాతావరణం నెలకొంది. 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా.. రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి ప్రధాని మోడీ నివాళ్లు అర్పించారు. ఎర్రకోట వద్దకు చేరుకున్న ప్రధాని మోదీకి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ స్వాగతం పలికారు.

జాతీయ గీతాలాపన అనంతరం ఆహుతులపై భారత వైమానిక దళానికి చెందిన హెలీకాప్టర్లు పూల వర్షం కురిపించాయి. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌ షా, స్మృతి ఇరాని, నిర్మలా సితారామన్‌ సహా ఇతర మంత్రులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, అతిథులు పాల్గొన్నారు.